Disco Shanti.. అప్పట్లో స్పెషల్ సాంగ్ లకు పెట్టింది పేరుగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది డిస్కో శాంతి (Disco Shanti) . చాలామంది స్టార్ హీరోల సినిమాలలో తన డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈమె.. దివంగత నటుడు, రియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న శ్రీహరి (Srihari) ని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయింది. భర్త, పిల్లలు అంటూ జీవితాన్ని గడుపుతున్న ఈమె జీవితంలో అనూహ్య మలుపులు చేటు చేసుకోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీహరి మరణంతో డిస్కో శాంతి కోలుకోలేకపోయారు. ఆర్థికంగా చితికిపోయారు. అయినవాళ్లే మోసం చేసి వారిని రోడ్డున పడేలా చేశారని.. అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలలో నిజం ఉందని డిస్కో శాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పకు వచ్చింది.
రాఘవ లారెన్స్ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్న డిస్కో శాంతి..
తాజాగా ప్రముఖ స్టార్ హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్(Elvin Lawrence)తో కలిసి నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్’. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది డిస్కో శాంతి. ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయగా.. ఒక జ్యోతిష్యురాలి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తున్న ఈమె తాజాగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తోంది.
తన దగ్గరికి వచ్చేవారికి గట్టి భరోసా ఇచ్చేవారు శ్రీహరి – డిస్కో శాంతి
ఈ క్రమంలోనే డిస్కో శాంతి మాట్లాడుతూ..” రాత్రిపూట మా ఆయన శ్రీహరి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా.. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ ఉన్నా కూడా.. ముందు రోజు రాత్రంతా ఎవరి సమస్యలైన వింటే మాత్రం వాటికి పరిష్కారం చూపించడానికి ప్రయత్నించేవారు. ముఖ్యంగా తన దగ్గరకు వచ్చేవారికి డబ్బు కాకుండా.. భరోసా ఇచ్చేవారు.. నేను కూడా ఆయన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఎవరికైనా మనం మంచి చేస్తే.. దేవుడు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని శ్రీహరి ఎప్పుడూ నమ్మేవారు” అంటూ శాంతి చెప్పుకొచ్చింది.
అయిన వాళ్లే మోసం చేశారు – డిస్కో శాంతి
అలాగే ఆస్తిపాస్తులపై ఆమె మాట్లాడుతూ.. శ్రీహరి సినిమాలలో చాలా బాగా సంపాదించారు. కానీ వాటిని సగం అవసరాలకు వాడుకోగా.. మిగతావన్నీ దానం చేసాము. అయితే మిగిలిన ఆస్తులు మాత్రం మా బంధువులే కాజేశారు. ఇక ఏం చేయలేక ఊరుకున్నాము. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి దిగజారింది. అప్పుడే శ్రీహరి చనిపోయాడు. ఏం చేయాలో తెలియలేదు.మా దగ్గర ఉన్న ఆస్తుల విలువ మాకు తెలియదని తెలిసి కొంతమంది చాలా తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేశారు.
ఆకలితో నరకం చూసాము – డిస్కో శాంతి
అప్పుడు తిండికి కూడా కష్టం అనిపించేది. ఆకలితో నరకం చూసిన రోజులు కూడా ఉన్నాయి. చివరికి బంగారం తాకట్టు పెట్టి జీవనాన్ని గడిపాము. ముఖ్యంగా మేము సంపాదించిన చాలా డబ్బులు దానధర్మాలకే పోయింది. అటు రావాల్సిన డబ్బు కూడా రాలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది డిస్కో శాంతి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీహరి బ్రతికి ఉండి ఉంటే మీకు ఈ కష్టాలు వచ్చేవి కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Kangana Ranaut: 40కి చేరువలో పెళ్లికి సిద్ధమవుతున్న కంగనా.. అదిరిపోయే రియాక్షన్!