Singeetham Srinivas Rao: సినిమా అంటే జీవితం కాదు.. సినిమా జీవితంలో ఒక భాగం మాత్రమే అని నమ్మే సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది సినిమానే జీవితంగా మార్చుకున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం చేసి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి తన అసాధారణమైన ప్రతిభతో చరిత్ర తిరగరాసిన సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivas Rao) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. నేడు ఆయన భౌతిక కాయం మనల్ని వీడబోతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. భైరవద్వీపం, ఆదిత్య 369 , విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మయూరి, మైఖేల్ మదన కామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే తన కెరియర్లో సుమారుగా 61 చిత్రాలు చేసి వాటితో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు? అనే ప్రశ్న అభిమానులలో కూడా తలెత్తుతోంది.
1931 సెప్టెంబర్ 21న మద్రాస్ ప్రెసిడెన్సీ లోని అప్పటి నెల్లూరు జిల్లా గూడూరులో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి రామచంద్రరావు.. హెడ్ మాస్టర్ గా పనిచేసేవారు. తల్లి శకుంతల బాయి వయోలిన్ వాద్యకారిణి. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నాటకాలు, సంగీతం రెండింటిలో కూడా ఆయన ప్రతిభ కనబరిచారు. అయితే చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఆయన తనకంటూ ఒక డిగ్రీ పట్టా ఉండాలనుకొని అలా చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. చదువు పూర్తవగానే. వెంటనే ఆయన సినిమాలలోకి రాలేదు.
ఒకవైపు హరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో నాటకాలలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూనే.. దర్శకుడు కె.వి.రెడ్డిని కలిసే ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలం అవడంతో సుల్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేశారు. కొంతకాలం సైన్స్ టీచర్ గా పని చేశారు. ఒకవైపు టీచర్ గా ఉద్యోగం చేస్తూనే.. మరొకవైపు మంచి కథలను రాయడం మొదలుపెట్టారు. అలా భ్రమ, అంత్యఘట్టం అనే రెండు ప్రయోగాత్మక నాటకాలు రాసి వీటి ద్వారా అవార్డులు కూడా అందుకున్నారు. అంతేకాదు తెలుగు స్వతంత్ర పత్రికకు నాటకాలను రాస్తూ పాత్రికేయుడిగా కూడా పనిచేశారు.
తనకు ఇష్టమైన డైరెక్టర్ కెవి రెడ్డిని కలవాలనే ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తూ.. 1954లో చివరికి ఆయనను కలవడంతో సఫలం అయ్యాయి. కె.వి.రెడ్డి సింగీతం శ్రీనివాసరావుకి ‘ది మంకీస్ పా’ ప్రతిని ఇచ్చి, దాని ఆధారంగా ఒక స్క్రిప్ట్ రాయమని కోరగా.. శ్రీనివాసరావు మూడు నెలల్లోనే సంభాషణలతో పాటు స్క్రిప్ట్ కూడా రాశారు. కేవీరెడ్డి సింగీతం ప్రతిభను మెచ్చి తన శిష్యుడిగా స్వీకరించారు. ఆ తర్వాత కేవీ రెడ్డి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తూ.. దొంగరాముడు, ఉమా చండీ గౌరీ శంకర్ల కథ , మాయాబజార్, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం వంటి చిత్రాలన్నింటిలో కూడా ఆయనతో కలిసి పని చేశారు. 1972లో తొలిసారి నీతి నిజాయితీ అనే ఒక విభిన్నమైన చిత్రంతో దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన అందుకు తగ్గట్టుగా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు అయితే ఆ అవార్డులలో కొన్నింటిని ఆయన రిజెక్ట్ చేయడం వెనుక అసలు కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు. చివరిగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి . ఈమధ్య కాలంలో అవార్డు వచ్చింది అంటే దానిని చూపించుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది.
ALSO READ: సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్!
ఎవరైనా ఒక అవార్డు వచ్చిందని నన్ను పిలిస్తే నాతో పాటు ఇంకో నలుగురు వస్తారు.. వీళ్ళందరూ వస్తే జనం వస్తారు. జనం వస్తే స్పాన్సర్స్ వస్తారు.. స్పాన్సర్స్ వస్తే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి . అడ్వర్టైజ్మెంట్స్ వస్తే డబ్బు వస్తుంది. నన్ను ఎందుకు పిలిచారంటే సింగీతం శ్రీనివాసరావు మంచి డైరెక్టర్ అని కాదు. ఆయన వస్తే జనం వస్తారు.. దాని వెనుక డబ్బు వస్తుంది.. ఇలా ఇంత లింక్ ఉంది . అందుకే నాకు రియలైజ్ అయ్యింది . నన్ను వదిలేయండి అని చెప్పాను. ముఖ్యంగా ఈ అవార్డ్స్ వేడుకలకు వెళ్తే శాలువా కప్పుతారు ఆ తర్వాత జరిగేదంతా అందరికీ తెలిసిందే . అందుకే ఇదంతా నచ్చక.. ఎన్నో అవార్డ్స్ వదులుకున్నాను అంటూ చెప్పారు.