India Joy 2026:హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ మార్చాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘ఇండియా జాయ్ 2026’ వేడుకలకు టాలీవుడ్ తమ సపోర్ట్ ని ప్రకటించేసింది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కాకుండా, మన తెలుగు సినిమాల మార్కెట్‌ను ప్యాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి ఈవెంట్ ఉపయోగపడతాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఈ వేడుకల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో భాగంగా ఈ ఇండియా జాయ్ 2026ను నిర్వహిస్తున్నారు. సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), గేమింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ వంటి రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది.
ఈ సమావేశానికి దిల్ రాజుతో పాటు నిర్మాతలు సురేష్ బాబు, సి. కళ్యాణ్, సాయి రాజేష్, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, దర్శకులు వీఎన్ ఆదిత్య, హరీష్ శంకర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి పరిశ్రమ అంతా కలిసి పనిచేస్తుందని దిల్ రాజు తెలిపారు.ఇక చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయని, ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రభుత్వ ఆలోచన చాలా బాగుందని నిర్మాత సురేష్ బాబు మెచ్చుకున్నారు.
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్యాన్ ఇండియా నుండి ప్యాన్ వరల్డ్ స్థాయికి చేరుకున్న సంఘటి తెల్సిందే .ముఖ్యంగా జక్కన్న తీసిన బాహుబలి, RRR,సుకుమార్ పుష్ప2, నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడీ సినిమాలు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని అలరించి వెయ్యి కోట్ల పై చిలుకు వసూల్లని సొంతం చేసుకున్నాయి కూడా.ఇక తాజాగా జరిగే ఇండియా జాయ్ తో తెలుగు సినిమా స్థాయి మరింతగా పెరగడం పక్కా.
ఇక ఇండియా జాయ్ లో సుమారు లక్ష మందికి పైగా అతిథులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డినెగ్, ఈఏ స్పోర్ట్స్, యూబిసాఫ్ట్ వంటి సంస్థలతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు కూడా భాగం కానున్నారు.పైగా సినిమాలలో దూసుకువస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వర్చువల్ ప్రొడక్షన్ వంటి కొత్త టెక్నాలజీలపై ఎక్స్పర్ట్స్ తో మన టెక్నీషియన్స్ ఎన్నో విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఉంది కూడా.
ఇక ఈ వేడుకల్లో భాగంగా వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తుంది.. అంతేకాకుండా డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ ఈవెంట్, 9న కాన్సర్ట్ ఎరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ కాన్సర్ట్ ఎరీనాను ప్రారంభించనున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఇండియా జాయ్ 2026 తెలుగు సినిమా స్థాయి పెరగడానికి ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుందనడంలో సందేహం లేదు.
ALSO READ:నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్