Betting Apps promotion Case:గత కొన్ని సంవత్సరాలుగా బెట్టింగ్ భూతం సామాన్య ప్రజల ప్రాణాలను ఎంతలా బలి తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేసి మరీ.. ఇందులో డబ్బులు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకొని, ఆ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అయితే ఇలా బెట్టింగ్ యాప్స్ లో యువకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రమోట్ చేసే ఈ బెట్టింగ్ యాప్స్ ను ఆ సెలబ్రిటీల అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎవరైతే స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారో వారందరికి అడ్డుకట్ట వేయడానికి ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో.. వారందరిపై కేసు ఫైల్ చేసి.. భవిష్యత్తులో బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టే లక్ష్యంగా పెట్టుకున్నారు.
29 మంది తెలుగు సెలబ్రిటీలపై ఈడీ కేస్ ఫైల్..
ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారిలో.. ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో పాటు సినీ సెలబ్రిటీలపై కూడా కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మొదలు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఇలా సినీ ఇండస్ట్రీ నుండి దాదాపు 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అయింది. అసలు విషయంలోకి వెళ్తే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. హైదరాబాదు, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
సినీ సెలబ్రిటీలపై కేస్ ఫైల్..
ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులలో రానా దగ్గుబాటి(Rana daggubati), మంచు లక్ష్మి (Manchu Lakshmi), విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రణీత(Pranitha ), నిధి అగర్వాల్(Nidhi Agarwal), శ్రీముఖి (Sreemukhi), రీతు చౌదరి (Rithu chaudhary), యాంకర్ శ్యామల(Shyamala ), అనన్య నాగళ్ళ(Ananya nagalla) తదితరులపై కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు..
అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో.. విష్ణుప్రియ, నీతూ అగర్వాల్, సిరి హనుమంతు, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, నయనీపావని, అమృత చౌదరి, నేహా పఠాన్ , పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, పండు, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, బండారు సుప్రీత వంటి వారి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మరికొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఈడీ కేసు నమోదు చేసుకుంది.
బెట్టింగ్ యాప్స్ యజమానులపై కూడా..
ఇకపోతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు.. ఇప్పటికే యాంకర్ విష్ణు ప్రియ, శ్రీముఖి, రీతు చౌదరి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే. అలాగే 19 మంది యాప్ ఓనర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఏ 23, జంగిల్ రమ్మీ డాట్ కామ్, యోలో 247 ఫెయిర్ ప్లే, తెలుగు 365, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, మామ 247, ఎస్ 365 జై 365, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, ధని బుక్ 365 వంటి బెట్టింగ్ యాప్స్ యజమానులపై కూడా కేసులు నమోదయ్యాయి.
ALSO READ:Mucherla Aruna: నటి ముచ్చెర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు.. అసలేమైందంటే?