HBD Pawan Kalyan:అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు రానే వచ్చింది. ( సెప్టెంబర్ 2 ) ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పుట్టిన రోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఇష్టం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. నేడు ఎంత ఆస్తి కూడబెట్టారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయిష్టంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్..
మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం పొందిన పవన్ కళ్యాణ్ కి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట. కానీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సతీమణి పవన్ కళ్యాణ్ వదినమ్మ సురేఖ కొణిదెల(Surekha Konidela) కోరిక మేరకు అయిష్టం తోనే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నేడు పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా ఇటు ప్రజల మన్ననలు పొంది ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలా ఒకవైపు హీరోగా.. మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ ను నిలబెట్టిన చిత్రాలు..
1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు జన్మించిన పవన్ కళ్యాణ్.. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదవ తరగతి వరకు తన విద్యను పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ పొందిన ఈయన.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. 30 ఏళ్ల సినీ కెరియర్ లో దాదాపు 30కి పైగా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. కెరియర్ కు పునాది వేసింది మాత్రం తొలిప్రేమ చిత్రం అని చెప్పాలి. ఈ సినిమాతో జాతీయ అవార్డు మాత్రమే కాదు, ఆరు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఆ తర్వాత గోకులంలో సీత, తమ్ముడు, బద్రి, గబ్బర్ సింగ్, ఖుషి ఇలాంటి చిత్రాలు పవన్ కళ్యాణ్ కెరియర్ కు మరింత దోహదపడ్డాయి. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25వ తేదీన ‘సుజీత్’ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు..
పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. రూ.150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్లో తన ఆస్తులు విలువ రూ.164 కోట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించగా.. అందులో సుమారుగా రూ.65 కోట్లు అప్పులు కూడా ఉన్నట్లు వివరించారు. ఈయనకు సినిమాల ద్వారా, రాజకీయం అలాగే రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో ఖరీదైన ఇల్లు కూడా ఉన్నాయి. విజయవాడలో ఉన్న ఇంటి విలువ రూ.16 కోట్లు కాగా.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటి విలువ రూ.12 కోట్లు. అలాగే బంజారాహిల్స్ లో ఒక ఫ్లాట్ (రూ.2కోట్లు)ఉంది. అలాగే నగర శివార్లలో ఫాం హౌస్ కూడా ఉంది. నిత్యం తన ఫామ్ హౌస్ లో గడుపుతూ అక్కడే వ్యవసాయం కూడా చేసేవారు పవన్ కళ్యాణ్.