HBD Prudhvi Raj:”30 ఇయర్స్ ఇండస్ట్రీ” అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు పృధ్వీరాజ్(Prudhvi Raj). నటన కంటే కాంట్రవర్సీతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఈయన పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారు? ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలయ్యింది? ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏ చిత్రాలలో నటించారు? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి పృధ్వీ రాజ్ బర్త్డే స్పెషల్ సందర్భంగా ఆయన గురించిన స్పెషల్ స్టోరీ మీకోసం.
ఖడ్గం సినిమాతో భారీ గుర్తింపు..
పృధ్వీరాజ్ అసలు పేరు బలిరెడ్డి పృధ్వీరాజ్. కామెడీ పాత్రలతోనే కాదు విలన్ పాత్రలు కూడా పోషించారు. ఇప్పటివరకు 75 చిత్రాలకు పైగా నటించారు. 1993లో ప్రముఖ స్వర్గీయ లెజెండ్రీ దర్శకులు ఇవివి సత్యనారాయణ (EVV Sathyanarayana) దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) హీరోగా వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించిన ‘ఖడ్గం’ సినిమాలో “30 ఇయర్స్ ఇండస్ట్రీ” అనే డైలాగ్ తో హాస్యనటుడిగా మరింత ప్రాచుర్యం అందుకున్నారు. అలాగే గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన ‘లౌక్యం’ సినిమాలో “బాయిలింగ్ స్టార్ బబ్లూ” పాత్ర కూడా ఈయనకు మంచి పేరు అందించింది.
సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే?
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఈయన తండ్రి బలిరెడ్డి సుబ్బారావు. వృత్తిరీత్యా రైల్వేలో పార్సిల్ మాస్టర్ గా, ఇటు నటుడిగా కూడా పనిచేశారు. ముఖ్యంగా మోహన్ బాబు, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి లాంటి స్టార్స్ తో కలిసి సుమారుగా 60 సినిమాలలో నటించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇల్లు కూడా వీరి వీధిలోనే ఉండేది. సినిమాల మీద మక్కువతో పృధ్వీ తండ్రి చెన్నైలో స్థిరపడగా.. పృధ్వీ తల్లి మాత్రం తాడేపల్లిగూడెంలోని చిన్న ఉద్యోగం చేసి, ఆ సంపాదనతో పృధ్వీని చదివించింది. డిగ్రీ పూర్తయ్యాక స్పోర్ట్స్ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు. పీజీ పూర్తయ్యాక 1992లో ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు చెన్నై వచ్చిన పృధ్వీకి.. ఒక హోటల్లో రిసెప్షన్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పించారు. అందులో ఉన్నంతకాలం సినిమా అవకాశాలు రాకపోవడంతో.. సినిమా దర్శకులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుందనే కారణంతో సిటీ కేబుల్ లో చేరాడు. ఒకరోజు ఇవివి సత్యనారాయణ తన సినిమా కోసం నటీనటులను అన్వేషిస్తున్నారని తెలుసుకొని వెళ్లి కలిశారు. అందులో ఒక బ్యాంకు మేనేజర్ పాత్రకు పృధ్వీ సరిపోతాడని భావించి ఎంపిక చేశారు. అలా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు పృథ్వీరాజ్.
తల్లి మరణం మరింత కృంగదీసింది..
ఈ సినిమా తర్వాత అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలు గుర్తింపును అందివ్వలేదు. దీంతో నిరాశ చెంది ఇంటికి వెళ్లిపోయారు. కానీ సినిమాల మీద మోజు చావకపోవడంతో మళ్లీ చెన్నైకి వచ్చేసారు .అదే సమయంలో తన తల్లి చనిపోవడంతో మరింత కృంగిపోయారు పృధ్వీరాజ్. అప్పుడే కృష్ణవంశీ ‘సింధూరం’ సినిమాలో పాత్ర అందుకున్నారు. ఆ తర్వాత చంద్రలేఖ, ఇడియట్, సముద్రం, ఖడ్గం, పోకిరి, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్ ఇలా మంచి మంచి సినిమాలలో మంచి పేరున్న పాత్రలు చేసి స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు.
సినిమాలలోనే కాదు రాజకీయాల్లో కూడా..
అటు రాజకీయాల్లో కూడా చలామణి అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చి టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్ పర్సన్ గా 2019 జూలై 28న బాధ్యతలు చేపట్టారు. కానీ తనపై ఆరోపణలు రావడంతో 2020 జనవరి 12న పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేసి.. 2024 లో జనసేన పార్టీలో చేరారు.
also read:Jyothi Krishna: వీరమల్లుకి – హైపర్ ఆదికి సంబంధం ఏంటి.. స్పెషల్ థాంక్స్ కార్డ్ వెనుక ఇంత కథ ఉందా?
.