Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు అటు సినీ ఇండస్ట్రీని, ఇటు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవుతుండడం చూసి తట్టుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న లెజెండ్రీ నటులుగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఈయన మరణం మరవకముందే ప్రముఖ సీనియర్ హీరోయిన్ బి.సరోజాదేవి (బి.Saroja Devi) కూడా కన్నుమూశారు. ఇక అంతలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గా , నిర్మాతగా, నటుడిగా కూడా పేరు సొంతం చేసుకున్న ధీరజ్ కుమార్ (Dheeraj Kumar).కూడా న్యూమోనియాతో బాధపడుతూ వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటూ నిన్న సాయంత్రం ఆయన కూడా తుది శ్వాస విడిచారు.
హీరో రవితేజకు పితృవియోగం..
ఇలా వరుస మరణాలు మరువకముందే ఇప్పుడు మళ్లీ మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ (Raviteja) తండ్రి రాజ గోపాల రాజు(Raja Gopala Raju) నిన్న రాత్రి హైదరాబాదులోని రవితేజ నివాసంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. వయసు మీద పడడంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యల కారణంగానే ఈయన కూడా మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ తండ్రి మరణంతో రవితేజ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు . అటు రవితేజను పలువురు సినీ సెలబ్రిటీలు ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా.. రవితేజ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఫార్మసిస్టుగా గుర్తింపు..
ఇకపోతే రవితేజ తండ్రి భూపతిరాజు రాజ గోపాల రాజు ఫార్మాసిస్టుగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటకు చెందినవారు. రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్న ఈయనకు.. ముగ్గురు సంతానం.ఆ ముగ్గురు కొడుకులలో రవితేజ పెద్దవాడు కాగా.. రఘు , భరత్ తర్వాత జన్మించారు. ఇటు రఘు, భరత్ కూడా నటులుగానే పనిచేయడం గమనార్హం. భూపతి రాజు రాజగోపాల రాజు తండ్రి పశ్చిమగోదావరి జిల్లాలోని ఖండవల్లి గ్రామం నుంచి జగ్గయ్యపేటలో స్థిరపడినట్లు సమాచారం.
రవితేజ కెరియర్..
రవితేజ విషయానికి వస్తే.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, జైపూర్, ముంబై, భోపాల్ మొదలైన ప్రదేశాలను ఎక్కువగా సందర్శించేవారట..కుటుంబంతో సహా విజయవాడలో సెటిల్ అయిన ఈయన డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, ఆ తర్వాత 1997లో కృష్ణవంశీ తీసిన ‘సింధూరం’ సినిమాలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా నటించి అలా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక తర్వాత ‘నీకోసం’ అనే సినిమాతో హీరోగా మారిన రవితేజ.. ప్రస్తుతం ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.