Jayam Ravi: ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు జయం రవి (రవి మోహన్), సింగర్ కమ్ స్పిరిచువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్ మధ్య బంధం ముగిసిందా? గత కొన్ని నెలలుగా కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వీరి స్నేహం బ్రేకప్‌కు దారితీసిందా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. కెనీషా ఫ్రాన్సిస్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. తాను చెన్నై నగరాన్ని, సోషల్ మీడియాని పూర్తిగా వదిలి వెళ్ళిపోతున్నట్లు ప్రకటిస్తూ ఆమె పెట్టిన పోస్ట్ పలు ఊహాగానాలకు తెరలేపింది.
Read also-సుకుమార్ ఇచ్చిన లీక్.. రామ్ చరణ్ పెట్టిన కండీషన్!.. బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2024లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తదనంతరం 2025 నాటికి ఈ వివాదం కోర్టు మెట్లెక్కి తీవ్ర రూపం దాల్చింది. అయితే, జయం రవి-ఆర్తిల విడాకుల వెనుక సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఉందంటూ అప్పట్లో నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ కష్టకాలంలో కెనీషా, రవికి అండగా నిలబడ్డారు. ఇటీవల కేరళలోని ఒక ఆలయ ఉత్సవంలో కెనీషా లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా జయం రవి కూడా స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత ఆర్తి రవిని ఉద్దేశించి కెనీషా చేసినట్లుగా చెబుతున్న ఒక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం మళ్ళీ మొదటికొచ్చింది.
ఈ ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించిన కెనీషా.. ఇటీవల రెండు సుదీర్ఘ వీడియోలను విడుదల చేశారు. తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను, గతంలో తాను అనుభవించిన వేధింపులను ఆ వీడియోలలో పంచుకున్నారు. తాను జయం రవిని కేవలం ఒక ‘హీలర్’ (బాధల నుండి ఉపశమనం కలిగించే వ్యక్తి) గానే కలిశానని, ఆ తర్వాత అది మంచి స్నేహంగా మారిందని స్పష్టం చేశారు. తాను ఎవరి కాపురాన్ని కూల్చలేదని, తన అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్లే ఆ వివాదాస్పద కామెంట్ పోస్ట్ అయిందని వివరణ ఇచ్చారు.
ఖుష్బూ పోస్ట్, నెటిజన్ల నిరంతర ట్రోలింగ్ నేపథ్యంలో కెనీషా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఒక సుదీర్ఘమైన లేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. “నేను ఈ కథలోకి ఎంతో ప్రేమతో, ఆశతో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోతున్నాను. ప్రపంచం ఇప్పటికే ఒక నెగెటివ్ ముద్ర వేసేసిన ఒక వ్యక్తిని రక్షించేందుకు, అతనికి అండగా నిలబడేందుకు నా జీవితంలోని ముక్కలను అర్పించాను. కానీ ఈ సమాజంలో కరుణకు చోటు లేదని అర్థమైంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also-అర్ధ రాత్రి నడి రోడ్డుపై సీనియర్ నటి పావలా శ్యామల.. పాపం ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో..
తాను నమ్ముకున్న సంగీతాన్ని, స్పిరిచువల్ థెరపీని కూడా వదిలేస్తున్నట్లు కెనీషా ప్రకటించారు. ఆన్‌లైన్ బుల్లీయింగ్, మానిప్యులేషన్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ సోషల్ మీడియా అకౌంట్స్‌ను లాగౌట్ చేశారు. నేటితో “ఫెమినిజం గెలిచింది, సంతోషం ఓడిపోయింది” అంటూ పోస్ట్‌ను ముగించారు. కెనీషా చేసిన ఈ సంచలన పోస్ట్‌తో జయం రవి, ఆమె మధ్య ఉన్న బంధానికి అధికారికంగా తెరపడిందని నెటిజన్లు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె రాసిన ప్రతి అక్షరం బ్రేకప్‌ను స్పష్టం చేస్తోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే, కెనీషా పెట్టిన ఈ సుదీర్ఘ పోస్ట్, బ్రేకప్ ఊహాగానాలపై నటుడు జయం రవి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.