Kamal Haasan:ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో అభిమానులే హీరోల మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా సృష్టిస్తున్నారు అనే వాదనలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. నిజానికి అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవడమే కాకుండా గొడవకు కూడా దిగుతున్నారు. కానీ సెలబ్రిటీల మధ్య ఇలాంటి పట్టింపులు, గొడవలు, విద్వేషాలు లాంటివి ఏమీ ఉండవు. వారు సరదాగా కలిసి కనిపిస్తారు. కలిసి తిరుగుతారు. కలిసి ఎంజాయ్ కూడా చేస్తారు. అయితే ఇవన్నీ తెలిసి కూడా.. అభిమానుల మధ్య మాత్రం ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు సెలబ్రిటీలు సోషల్ మీడియా ముందుకు వచ్చి స్పందిస్తూ ఉంటారు..
రూమర్స్ కు ఆజ్యం పోసిన కమలహాసన్..
ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ (Kamal Haasan), రజనీకాంత్(Rajinikanth ) మధ్య పోటీ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వారి మాటల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో గత కొన్ని రోజులుగా కమలహాసన్, రజినీకాంత్ కలిసి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే ఆ రూమర్స్ కి ఇప్పుడు మరింత ఆజ్యం పోసేలా క్లారిటీ ఇచ్చారు కమలహాసన్.
రజనీకాంత్ తో త్వరలో మల్టీస్టారర్..
కమలహాసన్ మాట్లాడుతూ.. “నాకు, రజనీకాంత్ కి మధ్య ఎటువంటి పోటీ లేదు. అభిమానులు మాత్రమే మా మధ్య పోటీ ఉందని అనుకుంటున్నారు. ఈ రూమర్స్ ని చెక్ పెట్టడానికి మేమిద్దరం కలిసి నటించబోతున్నాము. అందుకే కలిసి సినిమాలు నిర్మించుకోవాలని , నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ అది కుదరలేదు. అయితే ఇప్పుడు త్వరలోనే అది సహకారం అవుతుంది” అంటూ కమలహాసన్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం మంచి స్నేహితులమే అంటూ స్పష్టత ఇచ్చారు. ఇకపోతే కొంతకాలంగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజనీకాంత్, కమలహాసన్ కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారన్న ప్రచారానికి ఈ ఒక్క ప్రకటనతో మరింత బలం చేకూరింది అని చెప్పవచ్చు.
కమల్ హాసన్ సినిమాలు..
కమలహాసన్ విషయానికి వస్తే.. ‘విక్రమ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న కమలహాసన్ ను చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విక్రం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చివరిగా థగ్ లైఫ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమలహాసన్.. మరోసారి అటు రజనీకాంత్ తో కూడా మల్టీస్టారర్ మూవీ చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవైపు సినిమాలలోనే కాదు మరొకవైపు రాజకీయాలలో కూడా వేగంగా దూసుకుపోతున్న ఈయన.. తన నిర్మాణ సంస్థ పై పలు చిత్రాలు నిర్మిస్తూ భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు.