CM Progress Report: ఎరువుల కొరత, ఫేక్ న్యూస్‌పై ఫైట్, పారిశ్రామికాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక తురకపాలెంలో అంతుచిక్కని వరుస మరణాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. మరి ఈ వారంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేంటి? వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?
01-09-2025 (సోమవారం) ( పేదల సేవలో సీఎం)
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పేదల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించారు. బోయనపల్లిలో ధోబీ ఘాట్ సందర్శించి రజకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీపై విరుచుకపడ్డారు సీఎం. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.
01-09-2025 (సోమవారం) ( 30 ఏళ్లు పూర్తి)
తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 ఏళ్లు అయిన సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలనా అంశాలు, ప్రజా సేవలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై తన అనుభవాలు వారితో పంచుకున్నారు. అధికారులైనా ప్రజా ప్రతినిధులు అయినా ఒక తపనతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు.
02-09-2025 ( మంగళవారం) ( ఎరువులపై రివ్యూ)
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ సంబంధిత అంశాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎరువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సరఫరా, పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలన్నారు.
02-09-2025 ( మంగళవారం) ( CRDA సమావేశం )
52వ సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాజధాని అమరావతి పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులను పకడ్బందీగా అమలు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది సమావేశం. స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వంటి ప్రాజెక్టులను సమర్ధంగా నిర్వహించేందుకు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ దోహద పడుతుంది. రానున్న రోజుల్లో హెల్త్ సిటీ బయో డిజైన్ ప్రాజెక్టును కూడా ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. బయో డిజైన్ ప్రాజెక్టులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏడు దేశాల నిపుణులు, సంస్థలు ముందుకు వచ్చాయి. కృష్ణా నదిలో ప్రకృతి సిద్దంగా ఉన్న ద్వీపాలను అభివృద్ధి కోసం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. సీఆర్డీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 1800 ఎకరాల భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. రైతులతో మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రక్రియను చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం కొన్ని ప్రముఖ హోటళ్లు ముందుకు వచ్చాయని అధికారులు సీఎం చంద్రబాబుకి వివరించారు. నిర్మాణాలు ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలని సూచిస్తూ ముందుకొచ్చిన సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ల నిమిత్తం భూములు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.
02-09-2025 ( మంగళవారం) ( అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం)
గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరోసారి తేల్చి చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు. దక్షిణాదిలో ఏపీ నెంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుందని… భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ పెరుగుతాయన్నారు.
03-09-2025 (బుధవారం) ( ఆర్ధిక సంఘ సభ్యులతో భేటీ)
రాష్ట్ర ఐదవ ఆర్ధిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ధిక సంఘం సిఫార్సులు సీఎంకు అందజేశారు అధికారులు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్ధిక-ఆర్ధికేతర అంశాలపై ఆర్ధిక సంఘం సిఫార్సులు చేసింది. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతోపాటు సొంత ఆదాయ వనరుల పెంపుపైనా అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. వెనకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించి వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం వివరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం కన్నా జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులకు ఖర్చు పెట్టే మొత్తం 111 శాతంగా ఉందని వెల్లడించింది.
03-09-2025 ( పర్యాటకశాఖపై సమీక్ష)
పర్యాటక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సంరద్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరాల్లో హోమ్ స్టేలను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. తిరుపతితో పాటు ఇతర ప్రముఖ దేవాలయాలున్న ప్రాంతాల్లో వీటిపై దృష్టిపెట్టాలన్నారు. అలాగే కోనసీమ ప్రాంతంలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ హోమ్ స్టేలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులకు స్థలాలను గుర్తించాలి. పోర్టుల వద్ద పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలి. అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలన్నారు సీఎం. రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అందించనున్న ఆరు పురాతన తెలుగు తాళపత్ర గ్రంథాలను ఈ సందర్భంగా సిఎం పరిశీలించారు.
04-09-2025 (గురువారం) ( ఫేక్‌పై ఫైట్)
ఫేక్ ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యింది ఏపీ ప్రభుత్వం. ఏకంగా ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలపై చర్చించారు. అంతేకాదు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
04-09-2025 (గురువారం) ( హెల్త్ పాలసీకి ఆమోదం)
సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీ వర్తించనుంది.
04-09-2025 (గురువారం) ( కేబినెట్ నిర్ణయాలు)
2025 జనవరి 1 లేదా ఆ తర్వాత రాజధాని అమరావతిలో విద్యా ఆరోగ్య సంరక్షణ సంస్థలకు భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే వీటి అమ్మకం లేదా లీజు డీడ్ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన స్టాంపు డ్యూటీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదన ఆమోదించారు. ఇక పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్‌షిప్ విధానంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపులను సక్రమంగా ఆమోదించడానికి సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి ఆమోదం తెలిపారు.
04-09-2025 (గురువారం) ( కేబినెట్ అభినందనలు)
ఇక జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది. భారత్ త్వరలోనే ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో సీఎం ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
05-09-2025 (శుక్రవారం) (ఈజ్ ఆఫ్ జస్టిస్ )
ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలు ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. మధ్యవర్తిత్వం అనే భావన భారతదేశానికి కొత్త కాదని, ఇది తరతరాలుగా మన సంస్కృతిలో భాగమని చంద్రబాబు గుర్తు చేశారు.
05-09-2025 (శుక్రవారం) ( వరుస మరణాలపై సమీక్ష)
గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో గత రెండు నెలలుగా సంభవిస్తున్న వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని, అనారోగ్య తీవ్రత ఎక్కువుగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్థులకు మెలియోయిడోసిస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబులకు పంపడం జరిగిందని.. 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని సీఎంకు తెలిపారు. పశుపోషణ పైనా ఎక్కువ మంది ఆధారపడటంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు. తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని, అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. యాంటిబయాటిక్స్ ఆరు వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు. ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
05-09-2025 (శుక్రవారం) ( గురుపూజోత్సవంలో సీఎం)
పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారని.. తాను నిత్య విద్యార్థిని.. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటా న్నారు. డీఎస్సీ అంటే ఎప్పుడూ జాప్యం చేయను.. సమయానికి భర్తీ చేస్తానని.. ఒకప్పుడు టీచర్ల బదిలీలు జడ్పీ ఛైర్మన్ చేతిలో ఉండేవి.. టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ తీసుకొచ్చింది తానేనని గుర్తు చేశారు సీఎం. కొన్ని ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారని.. తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నామన్నారు.
06-09-2025 (శనివారం) ( ఎరువుల లభ్యతపై సమీక్ష)
సరిపడా ఎరువలు అందుబాటులో లేవంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 77 వేల 396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ పోర్టుకు ఒక షిప్ వస్తోంది. దీని నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇవి కాకుండా మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రానున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎరువులు లేవంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడంతోపాటు, రైతాంగానికి భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.
Also Read: బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. వారం రోజులు వానలే వానలు..
06-09-2025 (శనివారం) ( యువ పారిశ్రామికవేత్తలతో భేటీ)
ఎంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్సు, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని వారికి సూచించారు. సమీప భవిష్యత్తులో అమరావతి- హైదరాబాద్- బెంగుళూరు- చెన్నై అతిపెద్ద కారిడార్ గా మారుతుందని, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్ మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని, అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఎకో సిస్టంను కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రూపొందిస్తున్న పాలసీలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాదు యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ కార్యక్రమాలపై వివరణ ఇచ్చారు సీఎం. రాష్ట్రం తన పచ్చదనాన్ని ప్రస్తుతం ఉన్న 33 శాతం నుండి 50 శాతానికి పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు. వివిధ దేశాల పేర్లతో కూడిన నేపథ్య ఉద్యానవనాలతో పట్టణాలు, నగరాలను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు.
Story By Vamshi Krishna, Bigtv