Kota Srinivas Rao Dies: తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడు రావుగోపాలరావు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. ఆయన గురించి తెలియనివారు ఉండరు. ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి.
విలన్‌గా భయ పెట్టడం.. కామెడీతో నవ్వించడం.. ఎమోషన్స్‌తో ఏడిపించడం ఆయనకు తెలిసినట్టుగా వెండితెరపై మరొకరికి తెలీదని కొందరు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతున్నారు. తెలుగు సినీ అభిమానుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
స్వాతంత్య్రం ముందు పుట్టిన ఆయన, నాలుగైదు దశాబ్దాలపాటు వెండితెరపై ఎన్నో రకరకాల పాత్రలు పోషించారు. కేవలం నటుడిగా మాత్రమేకాదు.. రాజకీయ నేతగా ప్రజలు మనసులోని ఇప్పటికే అలాగే నిలిచిపోయారు. బీజేపీలో ఉన్నా వివాదాలకు దూరంగా ఉండేవారు.
బీజేపీకి వీరాభిమాని కోట శ్రీనివాసరావు. దివంగత, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతో బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో బీజేపీ పెట్టిన సభలు, సమావేశాలకు ఆయన హాజరయ్యేవారు. అప్పట్లో నటీనటులకు ప్రజల్లో మాంచి క్రేజ్ ఉండేది.
భారీ సభల్లో కోట డైలాగులకు ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చేది. అలా ప్రజలను ఆకట్టుకోవడంతో సక్సెస్ అయ్యారు కోట శ్రీనివాసరావు. ఆ సమయంలో బీజేపీ ముఖ్యనేతల దృష్టిలో పడ్డారు. పార్టీపై కోటా శ్రీనివాసరావుకు అభిమానం ఉందని గ్రహించింది హైకమాండ్. ఇలాంటి నేత తమకు ఉండాలని భావించింది.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 1990ల్లో బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగుపెట్టారు.
స్వాతంత్య్రం వచ్చిన నుంచి విజయవాడలో కాంగ్రెస్ గెలుస్తూ వచ్చేది. ఆ తర్వాత టీడీపీ వంతైంది. తొలిసారి బెజవాడ గడ్డపై కాషాయి జెండా రెపరెపలాంచిన ఘనత కోట శ్రీనివాసరావుకే దక్కుతుంది. ప్రజాసేవతో మంచి నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.
ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే ఆర్థికంగా తట్టుకోవాలని, ఆ పరిస్థితి తన దగ్గర లేదని పలు ఛానెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. దానివల్ల యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉండలేకపోయానని చెప్పుకొచ్చారు. పార్టీకి తాను ఎప్పుడూ దూరం కాలేదని, సేవా కార్యక్రమాలకు నేతల నుంచి ఆహ్వానాలు వచ్చేవని, వీలు చిక్కినప్పుడల్లా వాటికి వెళ్లేవాడనని తెలియజేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కానీ బీజేపీ నేతలతో నిత్యం టచ్‌లో ఉండేవారు.