Lata Mangeshkar:సాధారణంగా అభిమానులు తమ అభిమాన నటీనటులపై చూపించే ప్రేమ.. ఒక్కొక్కసారి అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక అభిమాని తమ అభిమాన హీరోయిన్ అయిన సమంత (Samantha) కు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరో అభిమాని రామ్ చరణ్ (Ram Charan) ఫోటో రూపంలో వరి నాట్లు వేసి.. అలా పండిన బియ్యాన్ని నేరుగా రామ్ చరణ్ ఇంటికే పంపించి తన అభిమానాన్ని చాటుకున్నారు. నిజానికి ఒకసారి అభిమానులు నమ్మారు అంటే ఇక వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు అని, ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా.. అయితే ఇక్కడ నటీనటులకే కాదు గాయకులకు కూడా అభిమానులు ఉంటారనటంలో సందేహం లేదు. అలా అభిమానులు చేసే పనులు వారిని అందలం ఎక్కిస్తాయి. అయితే ఇప్పుడు ఒక సింగర్ కి మాత్రం కనివిని ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే గౌరవాన్ని అందించారు ఆ అభిమాని. మరి ఆ సింగర్ ఎవరు? ఆ అభిమాని చేసిన పనేంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
గాత్రంతో శ్రోతల మనసులు దోచుకున్న లతా మంగేష్కర్..
ఆమె ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకురాలు, గాయని అయినా లతా మంగేష్కర్ (Lata Mangeshkar). ఈమె నటి కూడా కావడం గమనార్హం. 1942లో మొదలైన ఆమె కళా ప్రయాణం.. మొదటి హిట్ పాట ‘మహల్’ సినిమాలోని ‘ ఆయేగా ఆయేగా ఆయేగా ఆనేవాలా’ నేటికీ ఈ పాట శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది.
20 భాషల్లో 50వేలకు పైగా పాటలు..
అలా మొదలైన ఈమె ప్రయాణం ఏకంగా 980 సినిమాలను తన గానంతో అలరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి, అందరిని అబ్బురపరిచింది. ఈమె సోదరి ఎవరో కాదు ఆశాభోంస్లే. లతా మంగేష్కర్ పరిశ్రమకు అందించిన సేవకు గుర్తించిన భారత ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినిమా పాటల గాయనిగా పేరు సొంతం చేసుకున్న ఈమె హిందీ సినిమా జగత్తుపై చెరగని ముద్ర వేసింది.
4,359 లతా మంగేష్కర్ ఫోటోలతో అరుదైన గౌరవం..
అలా చెరగని ముద్ర వేసుకున్న ఈమెపై.. ఒక అభిమాని వైవిధ్యంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. జబల్పూర్ కి చెందిన రామ్ కృపాల్ నమ్ దేవ్ (Ram krupal Namdev) అనే ఒక చిత్రకారుడు ఏకంగా 4,359 లతా మంగేష్కర్ ఫోటోలతో కాన్వాస్ పై ఒక అందమైన అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనలో ఉంచగా.. ఈ చిత్రపటం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నం..
అంతేకాదు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఇప్పటికే ఈ చిత్రాన్ని రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారం. ఏది ఏమైనా కనీవినీ ఎరుగని రీతిలో లతా మంగేష్కర్ అందుకున్న గౌరవానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కచ్చితంగా లభిస్తుందని, ఇక చరిత్రలో ఏ సెలబ్రిటీకి దక్కని గౌరవం లతా మంగేష్కర్ కి దక్కింది అని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రపటం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.