Manchu Lakshmi Complaint on Journalist: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్పై సినీ నటి మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. మూవీ ప్రెస్ మీట్లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు జర్నలిస్ట్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా మంచు లక్ష్మి నటిస్తున్న లేటెస్ట్ మూవీ దక్ష: ఏ డెడ్లీ కాన్సిపరేన్సీ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమెను అవమాన పరిచేల ప్రశ్నించారు. తన వయసు, డ్రెస్సింగ్ని ఉద్దేశిస్తూ అమమానకర రీతిలో మాట్లాడారు. ఆయన ప్రశ్నకు మంచు లక్ష్మి వెంటనే కౌంటర్ ఇచ్చింది. అదే ప్రశ్న మహేష్ బాబుని అడుగుతారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న న్యాయపరమైన చర్యలకు దిగింది. సదరు జర్నలిస్ట్పై ఆమె ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఆమె ఇచ్చిన ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “నాలుగేళ్ల విరామం తర్వాత నేను మా నాన్నతో(మంచు మోహన్ బాబు) నటించిన నిర్మించిన చిత్రం ప్రమోషన్స్లో పాల్గొన్నాను. ఇందులో భాగంగా నా మొదటి ఇంటర్య్వూలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తిగారికి ఇచ్చాను. కానీ, దురదృష్టవశాత్తు ఇది ఇంటర్వ్యూ కాదు, వ్యక్తిగత దాడి అని అర్థమైంది. ఇంటర్య్వూలో సినిమా గురించి, నటన గురించి, లేదా ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడానికి మేము పడిన కృషి గురించి మాట్లాడటానికి బదులుగా.. ఆయన నన్ను కించపరచడానికే నిర్ణయించుకున్నారు.
నా వయస్సు, నా శరీరాకృతి, నా దుస్తులను లక్ష్యంగా చేసుకుని వయస్సు వివక్ష, బాడీ-షేమింగ్ చేశారు. ఆయన ప్రశ్నలలో నా పనిని అర్థం చేసుకునే ఉద్దేశం లేదు. అవి కేవలం అవమానించడానికి, నన్ను తక్కువ చేయడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి.. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనుకునే విషయం ఏంటంటే.. జర్నలిజం పట్ల, సత్యాన్ని వెలికితీయడానికి తమ జీవితాలను అంకితం చేసే జర్నలిస్టుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. అది ఒక ఉన్నతమైన వృత్తి, నిజాయితీతో ఆచరించినప్పుడే అసలైన సమాచారం అందించడం, మార్పు తీసుకురావడం, స్ఫూర్తినిచ్చే శక్తి ఉంటుంది. అందుకే, ఎవరైనా ఆ వేదికను దుర్వినియోగం చేసి ఆ బాధ్యతను విస్మరించినప్పుడు ఎంతో నిరాశ కలుగుతుంది. నిజానికి.. ఇది జర్నలిజం కాదు.
ఇది విమర్శ కాదు. ఇది ఒకరి గౌరవాన్ని పణంగా పెట్టి ‘వైరల్‘ అవ్వాలనే దారుణమైన ప్రయత్నం. ఈ ప్రశ్న అడిగేముందు ఎదుటి వ్యక్తి భావోద్వేగాలు వారికి అవసరం లేదు. ‘ఇది బాధపెడితే ఏంటి? కనీసం వైరల్ అవుతుంది కదా‘ చెప్పడం ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ మనస్తత్వం వృత్తివిరుద్ధం మాత్రమే కాదు, ప్రమాదకరం కూడా. ఆయన వ్యాఖ్యలను నేను హుందాగా ఎదుర్కొన్నాను. కానీ, మౌనంగా ఉండటం దీనికి ప్రత్యామ్నయం కాదు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావ్రతం కాకుండ అరికట్టాలి.
Also Read: Sadha Father : హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత
నేను మౌనంగా ఉంటే నాలాంటి ఎంతో మంది మహిళలు, తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఎంతోమంది మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన నిరంతరాయంగా కొనసాగడానికి అనుమతిస్తుంది. నేను సానుభూతిని అడగడం లేదు. నేను జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందుకే ఈ చర్యను తీవ్రంగా పరిగణించి, సదరు జర్నలిస్ట్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. అయితే ఆయన ఈ విధంగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. పదేపదే ఆయన ప్రదర్శించే ఈ అవమానకరమైన ప్రవర్తనకు జర్నలిజంలో స్థానం లేదు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అధికారికంగా హెచ్చరిక జారీ చేయాలని ప్రెస్ ఛాంబర్‌ను నేను కోరుతున్నాను” అంటూ మంచు లక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.