#Mega 158: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. జానర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఈమధ్య ఎక్కువగా కామెడీ , ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లో చిత్రాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు సోషియో ఫాంటసీ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేసిన చిరంజీవి.. ఇప్పుడు మరో చిత్రానికి సంబంధించి తనను తాను సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ బాబీ (Bobby) దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఇదివరకే చిరంజీవి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి #మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను నవంబర్ 5 బుధవారం నాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ శివయ్య ఆశీస్సులతో ఘనంగా నిర్వహించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
చిరంజీవి.. ‘బింబిసారా’ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేశారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడింది. మరొకవైపు ఈ యేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. నయనతార (Nayanthara) లీడ్రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ:War 2: థియేటర్లలో బొక్కబోర్లా.. ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2!
భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. కచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అవుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా చిరంజీవికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల సమర్పకురాలిగా పనిచేస్తున్నారు. అంతేకాదు విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ఒక 20 నిమిషాల పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకి పోటీగా ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు మరో నాలుగు చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఏ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.