పవన్ కల్యాణ్ ఇక భవిష్యత్ లో సినిమాల్లో నటించరా..? ఆయన అభిమానుల్లో ఇంకా ఆ అనుమానం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ప్రస్తుతం పరిపాలనలో బిజీగా ఉన్నారు. ఉన్న కాస్త సమయాన్ని ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకోసం వినియోగించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ తర్వాత ఓజీ వస్తుంది, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతోంది. అయితే ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు దూరమవుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఆ ఊహాగానాలు నిజమేననిపిస్తున్నాయి పవన్ వ్యాఖ్యలు. ఈ మూడు సినిమాలు పూర్తయితే చాలని అనుకుంటున్నానని, ఆ తర్వాత షూటింగ్ లకు గ్యాప్ వస్తుందని అన్నారు పవన్. ఈ మూడు సినిమాల తర్వాత ఇక ఆపేస్తా..భవిష్యత్ లో చేస్తానో లేదో కూడా తెలియదు అంటూ ఫ్యాన్స్ కి చేదువార్త చెప్పారు.
సినిమాలు మానేస్తారా..?
సినిమాలు మానేస్తారా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు పవన్. ఈ మూడు సినిమాలూ పూర్తయితే చాలనుకుంటున్నానని, కొత్త సినిమాలేవీ ప్లానింగ్ లో లేవన్నారు. అంటే దాదాపుగా పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. అయితే తాను పూర్తిగా సినీ రంగానికి దూరం కానని, ఇకపొ నిర్మాతగా కొనసాగడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు పవన్. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ఆల్రడీ ఉందని గుర్తు చేశారు. ఆ బ్యానర్ పై సినిమాలు తీస్తానన్నారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పలేదు.
రోజుకి 2 గంటలు..
పవన్ కల్యాణ్ పాలన పక్కనపెట్టి సినిమాలతో బిజీ అయిపోయారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. తాను పాలన పక్కనపెట్టలేదని, తన శాఖ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టానన్నారు. రోజుకి 2 గంటలు తన వ్యక్తిగత విషయాలకు కేటాయిస్తానని, ఆ సమయంలోనే సినిమా షూటింగ్ లకు హాజరవుతున్నట్టు చెప్పుకొచ్చారు. తన కోసమే సెట్టింగ్ లు విజయవాడలో వేసి సినిమాలు పూర్తి చేశామని వివరించారు. అధికారులు విశ్రాంతి తీసుకునే సమయంలోనే తాను సినిమా షూటింగ్ లకు వచ్చేవాడినని అన్నారు పవన్. సినిమాల విషయంలో తనకు పూర్తి క్లారిటీ ఉందని, తాను ప్రస్తుతం పరిపాలనపైనే దృష్టి పెట్టానన్నారు. ఆ తర్వాతే సినిమాలన్నారు. అయితే పాత కమిట్ మెంట్ లు ఇప్పటికే తనకోసం ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేందుకే ఇప్పుడు వరుసగా షూటింగ్ లకు హాజరవుతున్నానని అన్నారు. ఓజీ సినిమా షూటిింగ్ కూడా పూర్తైపోయిందని చెప్పారాయన. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మరో 4 రోజులు కేటాయిస్తే సరిపోతుందని, హరిహర వీరమల్లు ప్రమోషన్ల వల్ల ఆది కాస్త లేట్ అవుతోందన్నారు.
మొత్తమ్మీద పవన్ కల్యాణ్ తన అభిమానులకు నిరాశ కలిగించే వార్తే చెప్పారనుకోవాలి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కొత్త సినిమాలకు చాలా గ్యాప్ వచ్చే అవకాశముంది. కొత్త సినిమాలకోసం ఇంకా చర్చలు కూడా మొదలు కాలేదు కాబట్టి ఒకవేళ ఆయన సినిమాకి కమిట్ అయినా షూటింగ్ మాత్రం బాగా ఆలస్యం అవడం గ్యారెంటీ. ఈలోగా నిర్మాతగా పవన్ బిజీ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి.