Prajwal Child Artist:ప్రజ్వల్..జూనియర్ బాలయ్యగా గుర్తింపు తెచ్చుకున్నఈ కుర్రాడి జర్నీ స్పెషల్ అనే చెప్పాలి.ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే తన ప్రతిభతోనే ఈ స్థాయికి చేరుకున్నాడు. చిన్నప్పుడు డ్రామా జూనియర్స్ షోలో బాలకృష్ణ డైలాగ్స్‌తో మొదటి స్కిట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ కుర్రాడు ఆ స్కిట్ బాగా హిట్ అవ్వడంతో బాలయ్య డైలాగ్స్‌నే తన స్పెషాలిటీగా మార్చేసుకున్నాడు. అలా చివరికి డ్రామా జూనియర్స్ విన్నర్ అయిపోయాడు.
అయితే ఆ కుర్రాడే ఇపుడు ఏకంగా వెంకటేష్, త్రివిక్రమ్ లతో కలిసి’ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం .ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రజ్వల్ తన జీవితం, చదువు, సినిమా అనుభవాల గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ప్రమోషన్లలో మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రజ్వల్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిందన్న సంగతి తెల్సిందే. త్రివిక్రమ్, తమన్ లాంటి వాళ్లు కూడా తన మాటలకు ఫిదా అయిపోయారు. అయితే ఈ స్పీచ్‌ల వెనుక తన అమ్మానాన్నల కష్టం ఉందని ఇంట్లో నాన్న పేపర్ మీద పాయింట్స్ రాస్తే, ప్రజ్వల్ తన ఆలోచనలు చెప్పడం, అమ్మ సలహాలు ఇవ్వడం.. ఇలా ముగ్గురూ కలిసి స్పీచ్ తయారు చేసుకుంటారని అసలు విషయం బయట పెట్టాడు.
ఇక షూటింగ్ సమయంలో ప్రజ్వల్ దగ్గరున్న క్రికెట్ కిట్ చూసిన డైరెక్టర్ త్రివిక్రమ్, తన పుట్టినరోజున ఒక బెస్ట్ క్రికెట్ కిట్‌ను కానుకగా ఇచ్చారట. ఆ గిఫ్ట్ తన జీవితంలోనే అత్యంత మరచిపోలేనిదని, త్రివిక్రమ్ దగ్గర ప్రతిక్షణం ఏదో ఒకటి నేర్చుకోవచ్చని ప్రజ్వల్ చెప్పాడు. ఇక వెంకటేష్ గారి నుంచి నటనతో పాటు బయట అభిమానులతో ఎలా నడుచుకోవాలి, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకున్నట్లు తెలిపాడు. సెట్‌లో కమెడియన్ సత్య ఉంటే నవ్వులు పూసేవని, ఆయన కామెడీ టైమింగ్ చూసి నవ్వు ఆపుకోలేక ఐదారు టేక్స్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేసుకున్నాడు.
సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రజ్వల్ చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకపోవడం మెచ్చుకోతగ్గ విషయం.అయితే మ్యాథ్స్ డౌట్స్ వస్తే ChatGPT సాయంతో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటానని చెప్పేశాడు ఈ బుడ్డోడు. స్కూల్లో తనకు 75 నుంచి 85 శాతం మార్కులు వస్తాయని చెప్పాడు. భవిష్యత్తులో యాక్టర్ అవ్వాలని ఉన్నా, కంప్యూటర్ ఇంజినీరింగ్, డాక్టర్ లేదా సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచనలు కూడా వస్తుంటాయని చెప్పుకొచ్చాడు.
ఇక భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాక నాన్నకు రూ. 40 లక్షల కారు, అమ్మకు నెక్లెస్, నగలు, బామ్మలకు చీరలు కొనిచ్చి, అందరినీ ఫారిన్ ట్రిప్‌కు తీసుకెళ్తానని, ఇందుకోసం రూ. 50 లక్షలు ఖర్చు చేస్తానని చెప్పడం విశేషం.స్కూల్లో అమ్మాయిలతో మాట్లాడటానికి కొంత సిగ్గుపడే ప్రజ్వల్, అందరినీ అక్క లేదా చెల్లి అని పిలుస్తానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు ఈ చిచ్చర పిడుగు !
ALSO READ :కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?