Kollywood: కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్.. తన కుమారుడి వివాహం పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కి ఘాటుగా స్పందిస్తూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తనపై వస్తున్న ఆధారం లేని ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. ఏకంగా కోటి రూపాయలు ఇస్తానంటూ ఛాలెంజ్ విసిరారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత కన్నన్ రవి (Kannan Ravi). ప్రభుదేవా, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రామ్డిగ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్న నిర్మాత కన్నన్ రవి ఇటీవల తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా జరిగిన తన కుమారుడి వివాహం గురించి, గతంలో తనపై వచ్చిన చెక్ బౌన్స్ వ్యవహారం వరకు విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మాజీ మంత్రి డిఎంకె నేత దురైమురుగన్ కి మాత్రమే కాదు.. ఏ ఒక్క రాజకీయ నేతకు కూడా కనీసం లక్ష రూపాయలకు తాను బినామీగా ఉన్నట్టు నిరూపిస్తే ఏకంగా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాను అంటూ తెలిపారు.
నిర్మాత కన్నన్ రవి మాట్లాడుతూ..” నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా వైట్ మనీ. విదేశాలలో సంపాదించే ప్రతి రూపాయికి , ఖర్చు చేసే ప్రతి పైసా కి కూడా నేను పన్ను చెల్లిస్తున్నాను. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా రెండు పార్శాలు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అయితే వ్యాపారం చేసే ఏ ఒక్కరు కూడా ఉత్తములు కాదు.. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు నా కుమారుడి వివాహాన్ని ఇక్కడే నిర్వహించాను. పెట్టుబడులు రావాలి.. పెట్టుబడిదారులు రావాలని కోరుకుంటారు. కానీ పెట్టుబడుదారులు వస్తే వారిని ఎందుకు హేళన చేస్తారు. అలాంటివారిని సాధరంగా స్వాగతించండి. మాజీ మంత్రి దురై మురుగన్ ఇంటి ఆడబిడ్డను కోడలిగా చేసుకున్నంత మాత్రాన అవినీతిపరులు కాదు.. నా కుమారుడు పెళ్లికి ఖర్చుచేసిన నగదు , ఇసుక దోపిడీల సంపాదించిందంటూ ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు.
దుబాయ్ ఇసుక తిన్నెలో శ్రమించి, కష్టపడ్డాను. అలా సంపాదించిన ప్రతి రూపాయి కూడా నా కష్టార్జితం మాత్రమే. ప్రజలు పన్ను రూపంలో చెల్లించే సొమ్మును రాజకీయ నాయకులు స్వలాభాల కోసం ఖర్చు చేయకుండా మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలి” అంటూ కూడా పిలుపునిచ్చారు. ఇదే సమయంలో తన సంపాదనలో సేవా గుణాన్ని కూడా చాటుకున్నారు. గత 25 ఏళ్లుగా తన ఊరి ప్రజలకు బట్టలు, మిఠాయిలు పంచుతూ వారితో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా కన్నన్ రవి తన కొడుకు వివాహాన్ని గ్రాండ్గా జరిపించడం పై వచ్చిన విమర్శలపై తనదైన శైలిలో స్పందించి క్లారిటీ ఇచ్చారు.
also read: మెగాఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్!
ప్రముఖ కోలీవుడ్ నిర్మాతగా, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న కన్నన్ రవి.. ఇటీవల తన కుమారుడు దీపక్ రవి వివాహాన్ని చాలా గ్రాండ్గా జరిపించారు. దీపక్ రవి సీనియర్ డిఎంకె నేత దురై మురుగన్ మనవరాలైన కె. సెంథమరైని వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ధనుష్, శివ కార్తికేయన్, టాలీవుడ్ కమెడియన్ ఆలీతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇంతమంది స్టార్లు హాజరైనప్పటికీ కూడా ఈ వివాహం పైన కొన్ని ప్రత్యేక కారణాలు వల్ల ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా వెడ్డింగ్ కార్డు బాక్స్ ఒక్కొక్కటి ఏకంగా 25 వేల రూపాయలు పలకడం విమర్శలకు దారి తీసింది. ఒక సాధారణ వ్యక్తి నెల జీతాన్ని కేవలం ఒక్క ఆహ్వాన పత్రిక బాక్స్ కోసం ఖర్చు చేయడం కూడా తెలుగు, తమిళ్ డిజిటల్ క్రియేటర్లు విస్తృతంగా ట్రోల్ చేశారు. ఇక దానిపైన ఆయన తాజాగా స్పందించారు.