Radhika Apte: అసాధారణమైన నటనతో.. అద్భుతమైన ప్రతిభతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే (Radhika Apte). తన నటనతో ఇటు సౌత్ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ముఖ్యంగా అనుకున్నది అనుకున్నట్టుగా నిర్భయంగా మాట్లాడగలిగే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది .హిందీ తో పాటు తమిళం, మలయాళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
నిర్మాత వల్ల ఇబ్బందులు పడ్డా – రాధిక
ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గర్భధారణ సమయంలో ఒక నిర్మాత వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయింది. అంతటి నీచుడిని తాను ఎక్కడా చూడలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి రాధిక ఆప్టేను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ నిర్మాత ఎవరు? ఆమె ఏం చెప్పాలనుకుంటోంది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
గర్భవతిని అని తెలిసి కూడా ఇబ్బంది పెట్టాడు – రాధిక ఆప్టే
తాజాగా రాధిక ఆప్టే ప్రముఖ నటి నేహా ధూపియా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక చిట్ చాట్ షోలో పాల్గొనింది. అందులో తన అనుభవాలను పంచుకుంది. రాధిక ఆప్టే మాట్లాడుతూ..” నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఒక హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నాము. అయితే ఆ చిత్ర నిర్మాతకి అసలు మానవత్వమే లేదు. అప్పుడు నాకు మూడవ నెల ప్రెగ్నెన్సీ. ఈ విషయాన్ని నేను ఆ నిర్మాతతో చెప్పాను. శరీరంలో మార్పులు వచ్చాయి. అయినా సరే అతడు అర్థం చేసుకోకుండా బిగుతైన దుస్తులు ధరించమని బలవంతం చేశాడు. అసౌకర్యంగా బాధపడుతున్నప్పటికీ కూడా వైద్యుడిని కూడా కలవడానికి ఒప్పుకోలేదు. నొప్పితో ఇబ్బంది పడ్డాను. అయినా సరే కనికరం చూపించలేదు. తప్పని పరిస్థితుల్లో షూటింగ్ కొనసాగించాల్సి వచ్చింది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రాధిక.
అదే సమయంలో అండగా నిలిచిన డైరెక్టర్..
అదే సమయంలో తాను ఒక హాలీవుడ్ మూవీ కూడా చేస్తున్నానని, అయితే ఆ సమయంలో ఆ చిత్ర బృందం పూర్తిగా తనకు మద్దతుగా నిలిచిందని రాధిక చెప్పుకొచ్చింది. “నేను ఎక్కువగా తింటున్నాను.. శరీరంలో మార్పులు వస్తున్నాయని చెబితే డైరెక్టర్ నవ్వి.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి మీరు ఎలా ఉన్నా మాకు సమస్య లేదు. ఎందుకంటే మీరు గర్భవతి అంటూ ఆయన చెప్పిన మాటలు నాకు స్వాంతన కలిగించాయి అంటూ తెలిపింది” రాధిక ఆప్టే . తాను ఎప్పుడు ప్రత్యేక సౌకర్యాలు కోరుకోలేదని, కెరియర్, ప్రొఫెషనల్ నిబద్దతలు ఏంటో తనకు తెలుసు అని, కానీ మనిషిగా కనీస జాలి చూపించకపోతే మనిషిగా పుట్టి కూడా వృధా అంటూ తెలిపింది రాధిక.
రాధిక ఆప్టే సినిమాలు..
‘రక్త చరిత్ర 2’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాధిక, ధోని , లెజెండ్, లయన్ చిత్రాలు చేసింది. అలాగే కబాలి, క్రిస్మస్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈమె 2024లో తొలి బిడ్డకు జన్మనిచ్చింది.