Rajendra Prasad: తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ, ఏడిపిస్తూ మెప్పిస్తున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan)ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) తొలుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పద్మ పురస్కారం దక్కడం పట్ల చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తెలుగు దేశం ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప నటుడికి ఈ గౌరవం దక్కడం సరైన గుర్తింపు అని కొనియాడారు. రాజేంద్ర ప్రసాద్ సైతం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన పేరును సిఫార్సు చేయడంలో చూపిన చొరవను కొనియాడారు.
Also Read- Family Drama OTT : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్
అనంతరం రాజేంద్ర ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా సాగింది. రాజేంద్ర ప్రసాద్ రాగానే పవన్ కళ్యాణ్ ఆయనను ఆత్మీయంగా హత్తుకుని, శాలువాతో ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ (Padma Shri) వంటి ప్రతిష్టాత్మక అవార్డుకు రాజేంద్ర ప్రసాద్ పేరును సిఫార్సు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే విషయం తెలియంది కాదు. తన వెనుక నిలిచి, వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు పవన్ కళ్యాణ్‌కు రాజేంద్ర ప్రసాద్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read- Attitude Star: నువ్వు పాడింది భగవద్గీత కాదు.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలా? బెదిరిస్తున్నావా?
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీరు సినిమాల్లో పండించే హాస్యం, ప్రదర్శించే నటన కేవలం వినోదం మాత్రమే కాదు, ఎంతోమంది నటులకు అది ఒక పాఠం. ఈ పురస్కారం మీకు ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా సరైన గుర్తింపు దక్కడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని పంచుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తనకు లభించిన మద్దతుపై రాజేంద్ర ప్రసాద్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డుకు అర్హుడని, ఆయనకు ఈ అవార్డు ప్రకటించినప్పటి నుంచి అంతా కొనియాడుతున్న విషయం తెలిసిందే.
Also Read- Summer Holidays: ‘సమ్మర్ హాలిడేస్’ అంటూ రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్!