Rhea Kapoor: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ రియా కపూర్ టీమ్‌కు ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఊహించని షాక్ తగిలింది.అవును.. మే మొదటి వారంలో న్యూయార్క్‌లో అత్యంత వైభవంగా జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా 2026’ కోసం ఆమె సిద్ధం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన వజ్రాల నగలు మాయమవడం ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అనిల్ కపూర్ వారసురాలిగా, నటి సోనమ్ కపూర్ సోదరిగా బాలీవుడ్‌లో రియా కపూర్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
నిర్మాతగా ‘వీరే ది వెడ్డింగ్’ వంటి సినిమాలతో మెప్పించిన రియా, ఇటీవల టబు, కరీనా కపూర్, కృతి సనన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రూ’ (Crew) సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ స్టైల్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసే ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్ గాలా ఈవెంట్‌లో తన మార్క్ చూపించేందుకు రియా కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకున్నారు.
ఈ మెగా ఫ్యాషన్ ఈవెంట్ కోసం ముంబయికి చెందిన రెండు ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్స్ నుండి రియా కపూర్ రెంట్ బేసిస్‌పై అత్యంత ఖరీదైన నగలను సేకరించారు. అందులో ఒకటి రూ. 66 లక్షల విలువైన ఎమరాల్డ్ వజ్రాల దిద్దులు కాగా, మరొకటి రూ. 69 లక్షల విలువైన హై-క్వాలిటీ జాంబియన్ ఎమరాల్డ్ దిద్దులు. వీటి మొత్తం విలువ అక్షరాలా రూ. 1.35 కోట్లు. ఈవెంట్‌లో హైలైట్‌గా నిలుస్తాయనుకున్న ఈ వజ్రాల ఆభరణాలతో ఏప్రిల్ 27 రాత్రి రియా కపూర్ తన పర్సనల్ స్టాఫ్‌తో కలిసి ముంబయి నుండి న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కారు. ఇంత భారీ విలువైన జ్యువెలరీ బాక్సులను భద్రపరిచే బాధ్యతను గత ఏడేళ్లుగా తన వద్దే ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టారు. ప్రయాణమంతా ఎంతో సవ్యంగా సాగిపోయింది అనుకుంటున్న సమయంలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
సుదీర్ఘ విమాన ప్రయాణం ముగించుకుని ఏప్రిల్ 28 సాయంత్రానికి రియా కపూర్ బృందం న్యూయార్క్‌లోని ఒక లగ్జరీ హోటల్‌కు చేరుకుంది. అక్కడ ఈవెంట్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ ట్రయల్స్ రౌండ్స్ మొదలయ్యాయి. ఆ సమయంలో నగలను మరో టీమ్ మెంబర్ అయిన షిరీన్‌కు అప్పగించేందుకు మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచారు. లోపల ఉన్న జ్యువెలరీ బాక్స్‌లు తీసి చూడగా ఒక్కసారిగా పెద్ద షాక్ కి గురయ్యారు.ఎందుకంటే ఆ బాక్సులు ఉన్నాయి కానీ, అందులో ఉండాల్సిన రూ. 1.35 కోట్ల విలువైన వజ్రాల దిద్దులు మాత్రం మాయమయ్యాయి మరి. ఒరిజినల్ బాక్సులను కేవలం ఖాళీ డబ్బాలుగా మార్చేసి, లోపల ఉన్న అత్యంత విలువైన ఎమరాల్డ్స్‌ను ఎవరో చాలా స్మార్ట్‌గా, పక్కా ప్లానింగ్‌తో కొట్టేశారు. మెట్ గాలా వేదికపై మెరవాల్సిన విలువైన నగలు ఇలా చేతికి అందకుండా పోవడంతో రియా కపూర్ టీమ్ తీవ్ర ఆందోళనకు గురైంది.
దీంతో న్యూయార్క్ షెడ్యూల్ ముగించుకుని ముంబయికి తిరిగి వచ్చిన వెంటనే మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ముంబయిలోని సహార్ పోలీస్ స్టేషన్‌లో అఫీషియల్ గా ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ హై ప్రొఫైల్ దొంగతనం అసలు ఎక్కడ జరిగిందనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది.
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ఈ చోరీ జరిగిందా, లేక విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరైనా హ్యాండ్‌బ్యాగ్ జిప్ తీసి కాజేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే ఆ రోజు ఆ విమానంలో ప్రయాణించిన వారి వివరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెలబ్రిటీల పర్సనల్ స్టాఫ్ కళ్లెదుటే, అంతర్జాతీయ ప్రయాణంలో ఇంత భారీ చోరీ జరగడం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా ఈ హై-ప్రొఫైల్ మిస్టరీ వీడాలంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాల్సిందే.