Pradeep Rawat: ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో నితిన్ (Nithin) హీరోగా నటించిన ‘సై’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (Pradeep rawat) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విభిన్నమైన విలనిజంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన ఆగస్టు 4న క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. 74 సంవత్సరాల ప్రదీప్ రావత్ ను క్యాన్సర్ మహమ్మారి గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తూనే ఉంది. ఆ పోరాటంలో గెలవలేక తుది శ్వాస విడిచారు.ఆయన మరణాన్ని సినీ అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
బి.ఆర్.చోప్రా మహాభారత్ సీరియల్ లో అశ్వద్ధామ పాత్రతో మొదలైన ఆయన ప్రయాణం.. సై సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత గజిని, ఛత్రపతి, రాజన్న, దేశముదురు, పూలరంగడు, బాద్ షా , సౌఖ్యం, నాయక్, సరైనోడు, వీర, అల్లుడు శీను, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. చివరిగా గాయపడ్డ సింహం సినిమాలో నటించారు. అటు హిందీ, కన్నడ చిత్రాలలో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన జీవితంలో ఒక భయానక సంఘటన జరిగింది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రదీప్ రావత్ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన జీవితాన్ని మార్చేసిన ఒక ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వినోద్ ఖన్నా(Vinod Khanna) హీరోగా నటించిన ‘మహాసంగ్రామ్’ హిందీ సినిమా షూటింగ్ సమయంలో దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. సముద్రంలోని ఒక పెద్ద ఓడపై పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఆ సీన్ ప్రకారం వినోద్ ఖన్నా కొడుతుంటే ప్రదీప్ రావత్ తప్పించుకోవాల్సి ఉంటుంది. అయితే అంచనా తప్పి ఆయన నేరుగా ఎగసిపడుతున్న సముద్రపు అలల మధ్యలోకి పడిపోయారు. తీవ్రమైన కెరటాలు , సుడిగుండాల నడుమ ఓడ తిరుగుతుండగా.. ఆయన ఒక్కసారిగా సముద్రపు నీటిలో మునిగిపోయారు. ఇక ఓడ కింద ఉండే పవర్ఫుల్ ఇంజిన్ ఫ్యాన్ కు తగిలే పరిస్థితి ఏర్పడింది.
also read:ఊచకోత కోస్తున్న దందా.. 28 ఏళ్ల కల నెరవేరింది- డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి
అయితే అదృష్టవశాత్తు పడవ కింది భాగంలో ఉండే ఒక ఇనుప కమ్మి ఆయన చేతికి చిక్కగా.. ఆయన దానిని గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో అక్కడున్న జాలర్లు, చిత్ర సభ్యులు వెంటనే స్పందించారు. పైనుండి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబులు, తాళ్లు విసిరి జాలర్ల సహాయంతో ఆయనను సురక్షితంగా బయటకు తీశారు. అలా ఆరోజు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ప్రదీప్ రావత్ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గుర్తిండిపోయే విలన్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా తెరపై అద్భుతమైన విలనిజంతో పాటు ‘ఓయ్’వంటి చిత్రాలలో కామెడీ కూడా పండించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి.