Rukmini Vasanth:ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా తమకంటూ ఒక గుర్తింపు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ గుర్తింపు లభించిన తర్వాత తమకు నచ్చిన పాత్రలో.. నచ్చిన వారితో చేయాలనే కోరికను అప్పుడప్పుడు మీడియా సమావేశంలో లేదా ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు బయట పెడుతూ ఉంటారు. అయితే వీరి కోరికలను దర్శక నిర్మాతలు తీరుస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తన కోరికలను, కలలను డైరెక్టర్లు ఒకరి తర్వాత ఒకరు నెరవేరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఈమె లైనప్ చూసి అభిమానులు, సెలబ్రిటీలు కూడా లక్ అంటే ఈమెదే అంటూ తెగ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది రిషబ్ శెట్టి హీరోగా ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలో లీడ్ రోల్ పోషించి, ఏకంగా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాంటి ఈమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా గ్లోబల్ స్టార్ మూవీలో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర వార్త వినిపిస్తోంది. పెద్ది తర్వాత రామ్ చరణ్.. సుకుమార్ తో సినిమా చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.అటు సుకుమార్ కూడా స్క్రిప్టు పూర్తిచేసి, ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అంటూ వార్తలు రాగా.. తాజాగా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. పెద్ది సినిమా విడుదలైన తర్వాత 2026 సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని.. సుకుమార్, రామ్ చరణ్ పక్కన రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్ హీరోలతో పాన్ ఇండియా వైడ్ రుక్మిణికి మరింత ఫేమ్ లభించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
ALSO READ:Vrusshabha: మోహన్ లాల్ మూవీకి ఘోర అవమానం.. మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే?
ఇదిలా ఉండగా గతంలో తనకు రామ్ చరణ్ , ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని.. వారితో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో ఎలాగో సినిమా చేస్తోంది. ఇక రాంచరణ్ తో కూడా నటించబోతోంది అని వార్తలు రావడంతో.. గతంలో ఈమె చెప్పిన మాటలను అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకోవడమే కాకుండా అదృష్టం అంటే ఈమెదే.. దర్శకులు ఈమె కలలను నెరవేరుస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.