NFA -2025:కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న 2023వ సంవత్సరానికి గానూ.. మొత్తం 15 విభాగాలలో నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డ్స్ ప్రకటనపై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఒకరికి 33 ఏళ్ల కల సాకారం అయితే.. మరి కొంతమంది అలాంటి చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అలాంటి పాత్రలకు అవార్డ్స్ ఇవ్వడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. ఓవరాల్ గా ఈ నేషనల్ అవార్డ్స్ ప్రకటన ఒక వర్గం వారికి నిరాశ మిగిల్చింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా తీసుకోవడానికి ఇది పెన్షన్ కాదు..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక సీనియర్ నటి తనకు నేషనల్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసినా.. ఆ విభాగంలో తనకు అవార్డు రావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తీసుకోవడానికి ఇది పెన్షన్ కాదు.. ఏ కాలమానం ప్రకారం తనకు ఈ విభాగంలో అవార్డు ఇచ్చారు అంటూ నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన 11 మంది జ్యూరీ మెంబర్స్ ను ఆమె ప్రశ్నించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అవార్డు ఇవ్వడంపై జ్యూరీ మెంబర్స్ ను ప్రశ్నించిన ఊర్వశి..
ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణి ఊర్వశి (Urvashi ) ఈమె నటించిన ‘ఊళ్లోళుక్కు’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయనటిగా ఈమెకు నేషనల్ అవార్డు లభించింది. అయితే ఈ విషయంపై నటి ఊర్వశి ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఆమె మాట్లాడుతూ..” యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి అని ఏమైనా కొలమానాలు రాసి పెట్టారా? లేదంటే ఫలానా వయసు దాటిందంటేనే ఉత్తమ సహాయ నటి అవార్డులే ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? సైలెంట్ గా ఇచ్చిందేదో తీసుకోవడానికి ఇదేమి పెన్షన్ డబ్బు కాదు కదా.. మీరు నన్ను సహాయనటిగా ఏ లెక్కన పరిగణించారో నాకు చెప్పి తీరాలి. ఏ ఏ విధానాలు ఫాలో అయ్యారో.. ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారో కూడా చెప్పండి. అవార్డుల ప్రకటన ఎప్పుడైనా సరే గర్వంతో పొంగిపోయేలా ఉండాలి కానీ.. మళ్ళీ మేము తిరిగి ప్రశ్నించేలా ఉండకూడదు. ఉత్తమ నటిగా నాకు ఎందుకు అవార్డు ఇవ్వలేదు” అంటూ ఊర్వశీ జ్యూరీ మెంబర్స్ పై మండిపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఊర్వశి కెరియర్..
ఊర్వశి విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు కవిత మనోరంజిని.. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ హోస్ట్ గా, స్క్రీన్ రైటర్, చిత్ర నిర్మాతగా ఇలా పలు విభాగాలలో పనిచేస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. ప్రధానంగా మలయాళం, తమిళ్ చిత్రాలలో నటించే ఈమె.. కన్నడ, తెలుగు చిత్రాలలో కూడా నటించి పేరు సొంతం చేసుకుంది . తన అద్భుతమైన నటనతో 2 నేషనల్ అవార్డులు, 6 కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డులతో పాటు 2 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 3 సౌత్ ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకుంది.. 4 దశాబ్దాల సినీ కెరియర్ లో అమ్మ, అక్క, వదిన ఇలా పలు పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఊర్వశి.
Also read: SSMB 29: హైప్ పెంచుతున్న గాసిప్స్.. వినడానికే ఇంత బాగుంటే.. మరి చూస్తే!