Mahesh Babu: పైకి నవ్వుతూ కనిపించేవారందరి జీవితాల్లో సంతోషం మాత్రమే ఉంటుంది అనుకోవడం పొరపాటు. లేదు లేదు.. డబ్బు ఒక్కటి ఉంటే చాలు ఆనందం అదే వెతుక్కుంటూ వస్తుంది అనేది కూడా పొరపాటే. డబ్బు ఉన్నా.. పైకి నవ్వుతూ కనిపించినా లోపల ఉండే వేదనను ఎవరూ తీర్చలేరు. గొప్పవారు ఏం చేస్తారంటే.. లోపల ఎంత చిత్రవధ అనుభవిస్తున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. అలాంటివారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు. డబ్బు ఉండి, ఆస్తి వుంది, పేరు ఉండి.. ఆయనకేమి బాధలు ఉంటాయి అని అనుకోవచ్చు. కానీ, మహేష్ ఒంటరివాడు. ఒక్క ఏడాదిలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు.
మహేష్ లా ఉండడం అందరి వలన కాదు. ఒక్కసారే జీవితంలో ఉన్న బంధాలు మొత్తం దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. దైవంలా భావించే తండ్రి.. దేవతలా చూసుకొనే తల్లి. అండగా ఉండే అన్న.. కళ్ళముందే ఏడాది వ్యవధిలోనే మరణిస్తే.. ఏ మనిషి అయినా కృంగిపోకుండా ఉండగలడా.. ? కానీ, మహేష్ ధైర్యంగా నిలబడ్డాడు. తన కుటుంబం కోసం తన బాధను దిగమింగుకొని బయటకు వచ్చాడు. ఫ్యాన్స్ ముందు నవ్వుతూ నిలబడ్డాడు. ఆయనలా ఉండడం ఎవరి వలన కాదు. ఇది ఫ్యాన్స్ అంటున్న మాట కాదు. మహేష్ మరదలు శిల్పా శిరోద్కర్ ఒక ఇంటర్వ్యూలోచెప్పుకొచ్చింది.
హిందీ బిగ్ బాస్ తరువాత శిల్పా శిరోద్కర్ అందరికీసుపరిచితురాలుగా మారింది. నమ్రత చెల్లిగా శిల్పాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడు కొద్దిగా గ్యాప్ దొరికినా ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన లైఫ్ గురించి, బావ మహేష్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలోశిల్పా.. తన అక్క నమ్రత గురించి చెప్పుకొచ్చింది. ఆమె వలనే తాను బతికి ఉన్నానని తెలిపింది. తల్లిదండ్రులు చనిపోయి డిప్రెషన్ లో ఉన్నప్పుడు అక్క నమ్రత, బావ మహేష్ నే జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపింది.
‘ నేను అక్క కన్నా ముందే ఇండస్ట్రీకి వచ్చాను. ఆమెకన్నా ముందే నాకు పెళ్లి అయ్యింది. వెంటనే పాప పుట్టింది. అందుకే నన్ను.. నమ్రత అక్క అనుకుంటారు. కానీ, నేను ఆమెకన్నా చిన్నదాన్ని. నా పెళ్లి తరువాతనే అక్కకు నేను క్లోజ్ అయ్యాను. ఇక మా పేరెంట్స్ మరణించాకా ఆమెకు ఒక చంటిబిడ్డగా మారిపోయాను. నా పరిస్థితినే బావ మహేష్ ఎదుర్కున్నాడు. కానీ, ఆయన బాధను ఎప్పుడు బయటకు చెప్పలేదు. ఒక ఏడాదిలోనే తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయాడు. అయినా అధైర్యపడకుండా కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను చూసిన మనుషుల్లో ఎంతో గొప్ప వ్యక్తి మహేష్. ఆయన ఎన్నో కష్టాలను చూసాడు. అయినా దృఢంగా నిలబడ్డాడు. ఫ్యామిలీ కోసం ఎన్నింటినో ఓర్చుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శిల్ప వ్యాఖ్యలు విన్న మహేష్ ఫ్యాన్స్.. ఆ కష్టం ఎలా భరించవయ్యా.. నిజంగా నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ SSMB29 సినిమాలో నటిస్తున్నాడు.