వైసీపీ నేతలు చాలామంది అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది అరెస్ట్ కి రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఒకే ఒక్కరి విషయంలో మాత్రం అరెస్ట్ దోబూచులాడుతోంది. నేడో రేపో అరెస్ట్ అంటారు, ఆ తర్వాత కోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. ఒకటీ రెండు సార్లు కాదు, వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక చాలాసార్లు ఈ తంతు జరిగింది. తాజాగా ఆయన మరోసారి కోర్టు నుంచి రక్షణ పొందారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. హైకోర్టు ఉత్తర్వులతో ఆయన ఊరట పొందడం పక్కనపెడితే మరికొన్నాళ్లు ఆయన టెన్షన్ కంటిన్యూ అవడం మాత్రం గ్యారెంటీ.
రప్ప రప్ప..
రప్ప రప్ప వ్యాఖ్యలతో పేర్ని నాని అరెస్ట్ ఖాయం అని అనుకున్నారంతా. అయితే ఈ కేసులో ఆయనకు కోర్టు రెండోసారి ఊరటనిచ్చింది. ఈనెల 31 వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ముందస్తు రక్షణ కోరుతూ కోర్టుని ఆశ్రయించగా, ఆయన అరెస్ట్ కి తొందరపడొద్దంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఎందుకీ కేసు..?
జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఓ కార్యకర్త రప్పా రప్పా నరుకుతాం అంటూ ఓ ఫ్లెక్సీ పట్టుకుని కనిపించారు. భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జగన్ ఆ తరహా ప్రచారాన్ని సమర్థించుకున్నారు. రప్పా రప్పా నరుకుతాం అంటే తప్పేముందన్నారు. అదే తప్పయితే అసలు సినిమాలోనుంచి ఆ డైలాగ్ తొలగించాలన్నారు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా బాగా ఫేమస్ అయింది. పేర్ని నాని మీటింగ్ లో కూడా కార్యకర్తలు ఇదే డైలాగ్ ని రిపీట్ చేశారు. దీంతో ఆయన కాస్త విసుగ్గా వారికి సమాధానం ఇచ్చారు. రప్పా రప్పా అంటూ ఊరికే మాట్లాడ్డం కాదు, అలాంటివన్నీ చీకట్లో చేసేయాలన్నారు. కన్ను కొడితే రప్పా రప్పా లేపేయాలన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కార్యకర్తల్ని దాడులకు ఉసిగొల్పేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని వారు పోలీస్ కేసు పెట్టారు. దీంతో పేర్ని నాని అరెస్ట్ ఖాయమనే వార్తలు వినిపించాయి. అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలు మాత్రం చాలా గంభీరంగా ఉంటాయి. అరెస్ట్ లకు తాము భయపడేది లేదంటారు, అదే సమయంలో కేసు నమోదయితే వెంటనే కోర్టులో క్వాష్ పిటిషన్ వేశ్తారు, దాంతోపాటు ముందస్తు బెయిల్ కూడా కావాలంటారు. ఇటీవల రప్ప రప్ప వ్యాఖ్యలతో ఆయన మరింతగా ఆందోళన చెందినట్టయింది. ఈసారి అరెస్ట్ ఖాయం అని తేలడంతో అజ్ఞాతంలోకి వెళ్లి కోర్టులో పిటిషన్ వేశారు.
ఇది రెండోసారి..
గతంలో కూడా పేర్ని నాని అజ్ఞాతవాసం గడిపారు. తన భార్యకు చెందిన గోడౌన్ వ్యవహారంలో కేసు నమోదు కాగా పేర్ని హడావిడి పడ్డారు. పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతవాసం గడిపారు. చివరకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జనంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా పేర్ని నాని అరెస్ట్ కి భయపడి అజ్ఞాతంలోకి వెళ్లడం విశేషం. మరోసారి కోర్టు ఊరటనివ్వడంతో పేర్ని నాని తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.