Siva Raj Kumar : కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు శివ రాజ్ కుమార్(Siva Raj kumar). కన్నడ నాట పదుల సంఖ్యలో చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో వివిధ భాషా చిత్రాలలో కూడా గెస్ట్ పాత్రలు పోషిస్తూ అందరిని అలరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పాన్ ఇండియా నటుడిగా పేరు సొంతం చేసుకున్న శివ రాజ్ కుమార్ తాజాగా కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శివరాజ్ కుమార్ బుధవారం నాడు తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నటుడు , సోదరుడు విజయ్ (Vijay Thalapathy) రాజకీయాల్లోకి రావడం నాకు చాలా నచ్చింది. అయితే విజయ్ ఏదైనా ఆలోచించి చేయాలి.. ఆయనొక గొప్ప నటుడు. అలాగే ఒక గొప్ప రాజకీయ నాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ శివ రాజ్ కుమార్ కామెంట్లు చేశారు. అంతేకాదు తమిళనాడు రాజకీయాలపై తనకు పూర్తిగా అవగాహన లేదు అని కూడా ఆయన తెలిపారు. ఇకపోతే కరూర్ తొక్కిసలాట ఘటనపై శివరాజ్ కుమార్ ఇక్కడ ఇన్ డైరెక్ట్ గా ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.మరి దీనిపై విజయ్ ఏదైనా స్పందించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
విజయ్ దళపతి ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు టీవీకే అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. వచ్చే ఏడాది ఎన్నికలలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే ఆయన ర్యాలీలు నిర్వహిస్తూ.. ప్రజలలో నమ్మకాన్ని చూరగొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నోసార్లు ర్యాలీలు నిర్వహించినా.. ఏ రోజు కూడా అపశృతి చోటు చేసుకోలేదు. కానీ ఇటీవల కరూర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో మాత్రం అనూహ్యంగా తొక్కిసలాట జరిగి, 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మందికి పైగా ప్రజలు గాయాల పాలయ్యారు. ఇకపోతే టీవీకే పార్టీ నేతలు ప్రభుత్వం నుంచి కేవలం 10,000 మందికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. కానీ తమ అభిమాన హీరోని చూడడానికి లక్షకు మించి ప్రజలు అక్కడికి చేరుకోవడంతోనే.. స్థలం సరిపోక తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక సమాచారం. మొత్తానికి అయితే తొక్కిసలాటలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాడు విజయ్. అంతేకాదు వీడియో కాల్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించాడు కూడా..
ఇదిలా ఉండగా విజయ్ చివరి చిత్రమైన ‘జననాయగన్’ సినిమాలో శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శివ రాజ్ కుమార్ పలు కోలీవుడ్ చిత్రాలలో గెస్ట్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయ్ చివరి చిత్రంలో కూడా ఆయన నటించాలని చిత్ర బృందం ఆయనను సంప్రదించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 26న విడుదల కానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శివరాజ్ కుమార్ తన కన్నడ చిత్రం 45 లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో అన్ని భాషలలో విడుదల కాబోతోంది.