Suman Kalyanpur Death: భారతీయ సంగీత ప్రపంచంలో మరో సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన స్వరంతో తరతరాల శ్రోతలను అలరించిన ప్రముఖ సీనియర్ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ (89) ఆదివారం (మే 31) కన్నుమూశారు. ఆశా భోస్లే మరణించిన కొన్ని వారాలకే సుమన్ కళ్యాణ్‌పూర్ కూడా దూరమవ్వడం సంగీత అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అవిభక్త భారతదేశంలోని ఢాకాలో 1937లో జన్మించిన సుమన్, బాల్యంలోనే ముంబైకి చేరుకున్నారు. ప్రారంభంలో పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, సంగీతం వైపు అడుగులు వేశారు. పండిట్ కేశవ్‌రావ్ భోలే, ఉస్తాద్ ఖాన్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందారు. 1954లో వచ్చిన ‘మంగు’ చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది.
తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ‘నా నా కర్తే ప్యార్’, ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే’, ‘నా తుమ్ హమే జానో’ వంటి ఎన్నో ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్స్ అందించారు. ముఖ్యంగా మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన డ్యూయెట్స్ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. ఆమె స్వరం గానకోకిల లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో శ్రోతలు తరచుగా గందరగోళానికి గురయ్యేవారు, అయినప్పటికీ సుమన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషల్లో ఆమె వేలాది పాటలు పాడారు. కళారంగానికి ఆమె చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది.
Read also-థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే
ఆమె మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్ స్పందిస్తూ, “ఆమె మరణంతో లలిత సంగీతంలో ఒక శకం ముగిసింది” అనగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ “భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సురెలైన స్వరం శాశ్వతంగా మూగబోయింది” అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. సుమన్ కళ్యాణ్‌పూర్ భౌతికంగా దూరమైనా, ఆమె పాడిన అమర గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.