SC on Darshan’s bail:కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan ) అభిమాని రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. చేసిన తప్పుకు ఏడాది కాలంగా నరకం అనుభవిస్తున్న దర్శన్ జైలులోనే మగ్గిపోయారు.ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసి ఎలాగోలా బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్ సముచితమైనది కాదు అంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ వేసింది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదు అని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఇక దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మద్దతుగా హైకోర్టు చర్యను తప్పు పట్టింది.
దర్శన్ బెయిల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నటుడుకి బెయిల్ మంజూరు చేసేటప్పుడు కర్ణాటక హైకోర్టు తన విచక్షణను సరిగ్గా ఉపయోగించుకోలేదు అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు దర్శన్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిబల్ ను కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పై సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నించకూడదో కూడా సమాధానం ఇవ్వాల్సిందిగా సీనియర్ న్యాయవాదిని కోరింది.
దర్శన్ తరఫు న్యాయవారికి ప్రశ్నల వర్షం కురిపించిన ధర్మాసనం..
ఇకపోతే గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు దర్శన్ కు బెయిల్ మంజూరు చేయగా.. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారించారు. జేబీ పార్దివాల, ఆర్.మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం నటుడు దర్శన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రశ్నించింది. ముఖ్యంగా సమాధానం రెడీ చేసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుతం కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
దర్శన్ మళ్లీ జైలు శిక్ష తప్పదా?
న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోతే దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఒక అభిమానిని చంపి ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ ఇలా బయట తిరగడంపై.. బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. వారికి అండగా ప్రభుత్వం కూడా నిలిచింది. ఇక మొత్తానికి అయితే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దర్శన్ మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
ప్రేయసి కోసం అభిమానినే పొట్టన పెట్టుకున్న హీరో దర్శన్..
ఇకపోతే హీరో దర్శన్ కి వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే తోటి నటి పవిత్ర గౌడ (Pavitra Gowda) తో రిలేషన్ కొనసాగిస్తున్నారు దర్శన్. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సదరు అభిమాని.. పవిత్ర గౌడకు 2024 జూన్లో అశ్లీల సందేశాలు పంపించారు. ముఖ్యంగా తన అన్నా వదినల జీవితాన్ని నాశనం చేస్తోంది అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారట. దీంతో మండిపోయిన పవిత్ర గౌడ దర్శన్ తో పాటు కొందరు గుండాల సహాయంతో రేణుక స్వామిని హతమార్చారు.ముఖ్యంగా అతడిని అత్యంత కిరాతకంగా హింసించి , దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇక ఈ కేసులో పవిత్ర గౌడ , దర్శన్ లను A1, A2 నిందితులుగా చేర్చగా.. ఈ హత్యకు సహకరించిన రౌడీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ALSO READ:Director Death: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ప్రభాకరన్ కన్నుమూత!