దక్షిణ భారతదేశంలో దోశెకు ఎంతోమంది అభిమానులు. అల్పాహారాల్లో మొదటి స్థానంలో ఉంటుంది దోశ. దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ దోశ అయినా పెనంపై వేయాల్సిందే… అయితే పెనంపై వేసిన దోశ దానికి అతుక్కుపోయి ఒక్కోసారి రాకుండా ఇబ్బంది పెడుతుంది. దాదాపు ప్రతి ఇల్లాలు ఎదుర్కొనే అది సాధారణమైన సమస్య ఇది. దీనివల్ల దోశ తినాలని కూడా అనిపించదు. విచ్చిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చిన్న చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే దోశ పెనం నుంచి సులువుగా వచ్చేస్తుంది.
పిండి పర్ఫెక్ట్ గా ఉండాలి
దోశ పిండిని ప్రత్యేక జాగ్రత్తలతో తయారు చేసుకోవాలి. లేకుంటే అది కూడా పెనానికి దోశను అతుక్కుపోయేలా చేస్తుంది. దోశ పిండి మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ మందంగా కాకుండా చూసుకోండి. మధ్యస్థంగా ఉన్న దోశ పిండి త్వరగా పెనం నుంచి వస్తుంది. అతుక్కుపోకుండా ఉంటుంది.
సాధారణ పెనంతో పోలిస్తే నాన్ స్టిక్ పాన్ ఉపయోగించడం వల్ల దోశలు పెనానికి అతుక్కోనే అవకాశం చాలా తక్కువ. అలాగే దోశ వేసే ముందు కొంచెం నీరు చిలకరించడం మర్చిపోవద్దు. అలా చిలకరించిన తర్వాత దోశ వేయండి. అప్పుడు దోశ త్వరగా పెనం నుంచి వచ్చేస్తుంది.
మంట ఎలా పెట్టాలి?
దోశను కాల్చేటప్పుడు మంట ఎంత పెడుతున్నారన్నది కూడా చాలా ముఖ్యం. మరి హై ఫ్లేమ్ మీద పెడితే దోశ వెంటనే పెనానికి అతుక్కుపోతుంది. అలాగే మాడిపోతుంది.
ఐసు ముక్కతో రుద్ది
స్టవ్ మీద పెనం పెట్టాక దాన్ని వేడి చేయండి. తర్వాత మంటను మధ్యస్థంగా పెట్టండి. పెనం పైన ఐసు ముక్కను పట్టుకొని రుద్దండి. ఆ తర్వాత దోశ పిండిని వేస్తే దోసె క్రిస్పీగా వస్తుంది. పెనానికి అతుక్కోదు కూడా.
ఉప్పు చిట్కా
దోశ పెనంపై అతుక్కోకుండా రావాలి అంటే ఉప్పును పెనంపై వేసి ఒకసారి బాగా రుద్దండి. ఆ తర్వాత తుడిచేయండి. ఇప్పుడు దానిపై దోశ వేయండి. దోశ అతుక్కోకుండా మాడకుండా వస్తుంది. అలాగే ఉల్లిపాయ ముక్కను తీసుకొని పెనంపై రుద్దడం వల్ల కూడా దోశ పెనానికి అతుక్కుపోయే అవకాశం చాలా తక్కువ.