ENT 2 Sushanth :2018లో తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) హీరోగా విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ తెరపైకి వచ్చిన యూత్ ఫుల్ కామెడీ కల్ట్ క్లాసిక్ మూవీ ఈ నగరానికి ఏమైంది?. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ఆడియన్ హృదయానికి చేరుకుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన సెలబ్రిటీల కంటే ఆయా పాత్రలను అభిమానులు ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాలోని పాత్రలను మళ్ళీ తెరపై చూడడానికి అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా ఈ సినిమా నుండి సుశాంత్ రెడ్డి (Sushanth Reddy) తప్పుకున్నట్లు అధికారిక ప్రకటన రావడం అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ముఖ్యంగా సుశాంత్ రెడ్డి కార్తీక్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని అందరి మనసుల్లో ఒకడిగా చేరిపోయాడు. అలాంటి సుశాంత్ రెడ్డి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అని తెలియడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందిస్తూ ఎమోషనల్ గా ఒక ట్విట్టర్ పోస్టు కూడా చేశారు. సుశాంత్ ఈ సినిమా నుండి వ్యక్తిగత కారణాలవల్ల తప్పుకోవడం నన్ను షాక్ కి గురిచేసింది అని చెప్పి ఎమోషనల్ అయ్యారు..
అయితే తాజాగా సుశాంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తాను ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. సుశాంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “ఈ నగరానికి ఏమైంది? సినిమా ఎప్పటికీ కూడా నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రం నాకు స్నేహితులను, జ్ఞాపకాలను, అపారమైన ప్రేమను అందించింది. నాకు నటన అంటే ఇష్టం. కాబట్టే ఎప్పుడూ నటుడుగానే ఉండాలనుకున్నాను. అయితే విధి నన్ను వెక్కిరించింది. ముఖ్యంగా ఈ మార్గం ఎంచుకోవడం అంత సులభం కాదు. ఎప్పుడైతే నేను సినిమాల్లోనే ఉండిపోతానని నా నిర్ణయాన్ని చెప్పానో.. అప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను వద్దనే చెప్పారు.
అయితే నా మనసు మాత్రం నిశ్శబ్దంగా నీకు నచ్చింది ఎంచుకోమని చెప్పింది. అప్పుడే నేను నటుడిగా ఇండస్ట్రీలోనే కొనసాగాలని కోరుకున్నాను. అందులో భాగంగానే ఈ నగరానికి ఏమైంది? సినిమా చేసాము. ఆ సినిమా వచ్చి ఇప్పుడు 8 సంవత్సరాలవుతుంది. ఈలోగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జీవితం ముందుకు సాగింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టమైంది. అందుకే సినిమాను నా ప్రస్తుత జీవితంతో సమతుల్యం చేయడం కఠినంగా మారిపోయింది. అందుకే సినిమాలు వద్దనుకొని ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ నుండి నేను తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.
ముఖ్యంగా నన్ను అమితంగా ప్రేమించే చిత్ర బృందాన్ని.. సెట్లో ఉండే ఆ వాతావరణాన్ని.. అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రేమను నేను మిస్ అవుతున్నాను. అయినా సరే ఈ సినిమా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తరుణ్ కథ చెప్పే విధానం, అబ్బాయిల నటనతో మీరు సినిమాలోకి పూర్తిగా లీనమైపోతారు. మీరు కొత్త కార్తీక్ తో వెంటనే ప్రేమలో పడిపోతారు. మీతో పాటు నేను కూడా సినిమాను థియేటర్లో చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ సుశాంత్ చెప్పుకొచ్చారు.
అయితే సుశాంత్ రెడ్డి షేర్ చేసిన ఈ ట్వీట్ చూస్తుంటే.. అభిమానులు ఈ సడన్ ట్విస్ట్ ఏంటి బాసూ.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సుశాంత్ రెడ్డి నిర్ణయం అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేస్తోందని చెప్పవచ్చు.
ALSO READ:S.Janaki: సింగర్ జానకమ్మ ఇంట్లో విషాదం. పోస్ట్ పెట్టిన చిత్ర!