Tharun Bhascker:తరుణ్ భాస్కర్..పెళ్లిచూపులు అంటూ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపు కి తిప్పుకున్న ఈ క్రేజీ ఫిలిం మేకర్ కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న సంగతి తెల్సిందే .
ఇక తాజాగా క్రేజీ కల్యాణం సినిమాతో నటుడిగా మరోసారి పలకరించిన తరుణ్ ఇపుడు ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ తో మరోసారి దర్శకుడిగా తన సత్తా చూపేందుకు రెడీ అయిపోయాడు.ఇక ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.
దర్శకుడిగానే ఎక్కువ సంతృప్తి..
తరుణ్ భాస్కర్‌ను చాలామంది నటుడిగా కూడా ఇష్టపడతారన్న సంగతి తెల్సిందే. అయితే నటుడిగా, దర్శకుడిగా ఈ రెండింటిలో ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తనకు దర్శకత్వమే ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని స్పష్టం చేశారు.
సినిమా నిర్మాణంలో ఉండే అనేక విభాగాలను తాను దగ్గరగా పరిశీలించానని ఎడిటింగ్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్ చేయడం, పోస్టర్ డిజైన్స్ చేయడం వంటి పనులు కూడా గతంలో చేశానని చెప్పుకొచ్చారు. సినిమాటోగ్రఫీ, లైటింగ్ వంటి విభాగాల్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ అనుభవాలన్నీ చివరికి దర్శకుడిగా తన పనికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.
నా సినిమా జడ్జిమెంట్ చాలా తప్పు
కొన్ని సినిమాలు అసలు ఎందుకు హిట్ అయ్యాయో అర్థం కాలేదని, మరికొన్ని అద్భుతంగా ఆడతాయని అనుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయని చెప్పారు.ఈ విషయంలో తన సలహాలు తీసుకునేవాళ్లు ముందుగా జాగ్రత్త పడాలని సరదాగా చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లతో సినిమా గురించి మాట్లాడేటప్పుడు కూడా ముందుగానే తన అభిప్రాయం తప్పు కావచ్చని వార్నింగ్ ఇస్తానని తెలిపారు.
ఒక సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనేది ముందుగా అంచనా వేయడం అంత సులభం కాదని, క్రికెట్‌లో ఏ బంతికి ఎవరు సిక్స్ కొడతారో చెప్పలేనట్లే సినిమా రిజల్ట్ కూడా కచ్చితంగా చెప్పలేమని వివరించారు.
‘పెళ్లిచూపులు’ కథను ఒప్పించడానికి చాలా కష్టపడ్డా!
తన కెరీర్‌లో తొలి సినిమా ‘పెళ్లిచూపులు’ కోసం ఎదుర్కొన్న కష్టాలను కూడా తరుణ్ భాస్కర్ గుర్తుచేసుకున్నారు. అప్పటికి తనెవరో ఇండస్ట్రీలో చాలామందికి తెలియదని, తన కథ చెప్పే విధానం గురించి కూడా ఎవరికీ అర్థం కాలేదని తెలిపారు.
సినిమా రఫ్ కట్ చూసిన తర్వాత కూడా కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తులు ఇదేం సినిమా అంటూ డౌట్ రైజ్ చేశారని చెప్పారు. వారి అభిప్రాయాలను తాను కూడా సీరియస్‌గా తీసుకొని, తనలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆలోచించానని ఆరోజుల్ని గుర్తు చేసుకున్నారు.అయితే తాను కథ రాసేటప్పుడు శుక్రవారం మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రాయలేనని తనకు తెలిసిన కథను, తనకు నచ్చిన కథను మాత్రమే రాయగలనని కుండ బద్దలు కొట్టేశారు తరుణ్ భాస్కర్ .
ALSO READ :నా సినిమాలన్నీ అంతే.. రిలీజ్ డేట్స్‌పై వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!