Venky Kudumula:టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం ఒక ఎత్తయితే.. అనుకున్న తేదీకి సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం మరో ఎత్తని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.షూటింగ్ పూర్తయినా అనేక కారణాలతో సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోతుంటాయి. తాజాగా ఇదే విషయం గురించి దర్శకుడు వెంకీ కుడుముల పలు ఆసక్తికర విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.
సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో నిర్మాతల మధ్య సరైన కమ్యూనికేషన్ ఎందుకు ఉండదనే ప్రశ్నకు వెంకీ సమాధానమిస్తూ బయట మీడియాకు, అభిమానులకు రిలీజ్ డేట్ తెలియకపోవడం వేరు.. సినిమా టీమ్‌లో పనిచేసే వాళ్లకు కూడా చివరి నిమిషం వరకు అసలు విషయం తెలియదని బాంబు పేల్చారు.. ఎందుకంటే ఒక తేదీని టార్గెట్‌గా పెట్టుకుని టీమ్ మొత్తం పని చేస్తుందని వివరించారు.
ఉదాహరణకు ఒక తేదీకి సినిమా విడుదల చేయాలని అనుకున్నప్పుడు ఆ సమయానికి పనులు పూర్తి చేయడానికి టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతుందని అన్నారు. కానీ చివరి నిమిషంలో క్వాలిటీ చెకింగ్ సమయంలో ఏదైనా సమస్య కనిపిస్తే మాత్రం ఇబ్బంది మొదలవుతుందని చెప్పారు. అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయడం ముఖ్యమా? లేక మంచి క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ముఖ్యమా? అనే ప్రశ్న ఎదురవుతుందని తెలిపారు. అలాంటి సమయంలో రెండో దానికే ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేశారు.
అయితే రిలీజ్ డేట్ మారుతుందని ముందుగానే ప్రకటించడం కూడా కష్టమేనని చెప్పుకొచ్చారు వెంకీ కుడుముల. . ఎందుకంటే సినిమా పోస్ట్ పోన్ అని ముందే చెబితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్న వాళ్లు కూడా స్లో అయిపోతారని అన్నారు. ఇక కొత్త డేట్ దగ్గర పడే సమయానికి మళ్లీ అదే టెన్షన్ మొదలవుతుందని వివరించారు. అందుకే కొన్నిసార్లు టీమ్‌లో పనిచేసే టెక్నీషియన్లకు కూడా చివరి వరకు పూర్తి విషయం చెప్పరని తెలిపారు.
ఇక తన సినిమాల రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను దర్శకత్వం వహించిన సినిమాలేవీ ముందుగా అనుకున్న తేదీకి విడుదల కాలేదని చెప్పారు. నిర్మాతగా చేస్తున్న సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని సరదాగా అన్నారు. తనకు ఇదొక ట్రాక్ రికార్డ్‌లా తయారైందని సరదాగా చెప్పుకొచ్చారు.
తన మొదటి సినిమా ‘ఛలో’ మొదటగా డిసెంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నా ఆ సమయంలో వరుసగా సినిమాలు ఉండటంతో థియేటర్లు దొరకలేదని చెప్పారు. దీంతో చివరకు ఫిబ్రవరికి విడుదల తేదీని మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘భీష్మ’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగిందని మొదట డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేసినా, ఆ సమయంలో బాలకృష్ణ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఉండటంతో ఫిబ్రవరికి వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
ఇక నితిన్ హీరోగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ సినిమా విషయంలో మాత్రం రిలీజ్ డేట్ టెన్షన్ మరింత ఎక్కువైందని మొదట డిసెంబర్‌లో విడుదల చేయాలని అనుకుని డేట్ కూడా ప్రకటించామని అయితే అదే సమయంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ లాంటి భారీ సినిమా ఉండటంతో విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందని తెలిపారు.
చివరకు సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు.మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినంత మాత్రాన ఆ తేదీకి సినిమా వచ్చేస్తుందని చెప్పలేమని చాలా విషయాలు రిలీజ్ డేట్ ని డిసైడ్ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు ఈ క్రేజీ ఫిలిమ్ డైరెక్టర్ !
also read:’35 చిన్న కథ కాదు’ వెనుక అసలు కథ ఇదే.. సీక్రెట్స్ బయటపెట్టిన విశ్వదేవ్!