Telugu Film Chamber : తెలుగు చిత్ర పరిశ్రమను ఉన్నత స్థానంలో పెట్టాలనే ఉద్దేశంతో 1979లో ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ అభివృద్ధిలో ఫిల్మ్ ఛాంబర్ స్థానం ఎంతో ఉంది. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్‌ను చూస్తే అసహించుకునే రోజులు వచ్చాయనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
అసలే ఇండస్ట్రీ సంక్షోభంలో ఉందంటే… ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారు. రోడ్డెక్కుతున్నారు. అవసరమైతే హై కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా రెడీగా ఉన్నారు వీళ్లు. ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయానికి తాళం వేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అసలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఏం జరుగుతుంది ? తిరుపతి మీటింగ్ రచ్చ ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
గత కొన్ని రోజుల నుంచి ఛాంబర్ పెద్దలు ఇండస్ట్రీ గురించి వదిలేసి, తమ పదవుల గురించి తపన పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్‌కి రావాలనే ఆలోచన కూడా ఈ మధ్య రావడం లేదు ఇండస్ట్రీ వాళ్లకు. వాళ్లే పదవలు కోసం కొట్టుకుంటున్నారు.. ఇప్పుడు మన సమస్యకు పరిష్కారం ఏం చెప్తాను అని అనుకుంటున్నారట.
ఎలక్షన్ టైం వచ్చేసింది…
దీని అంతటికి కారణం… ఎలక్షన్ టైం వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ఉన్న భరత్ భూషణ్ పదవీ కాలం జూలై 30తేదీకి ముగిసిపోనుంది. అంటే ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌కి ఎన్నికలు జరగాలి. కొత్త అధ్యక్షుడు రావాలి. కానీ, అదేం జరగలేదు.
దిల్ రాజు తప్పుకున్నట్టే.. తప్పుకోవాలి
భరత్ భూషణ్ కంటే ముందు.. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్ రాజు ఉండే వాడు. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే తప్పుకుని, పద్దతిగా ఎలక్షన్స్ జరిపించారు. అప్పుడు ప్రెసిడెంట్‌గా భరత్ భూషణ్ ఎన్నికయ్యాడు. ఇప్పుడు కూడా అలానే జరగాలి. కానీ, ఇప్పుడున్న ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఒప్పుకోవడం లేదు.
పదవీ కాలాన్ని పొడగించాలి – భరత్ భూషణ్
తాను తప్పుకోకుండా.. ప్రెసిడెంట్ పదవీ కాలాన్ని పొడగించాలని భరత్ భూషణ్ అంటున్నాడు. ఈయనకు సపొర్ట్‌గా ఇప్పుడున్న కోశాదికారి అశోక్ ప్రసన్న కూడా పదవీ కాలాన్ని పొడగించాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనిపై ఛాంబర్ ఎన్నికలను పర్యవేక్షించే ఈసీతో పాటు స్రవంతి రవికిషోర్ లాంటి వాళ్లు కూడా వ్యతిరేకించారు.
వివాదానికి తెర లేపిన తిరుపతి మీటింగ్..
ఇప్పటికే వేడిమీదు ఉన్న ఛాంబర్ రాజకీయం ఒక్క సారిగా వివాదాలు ముదిరిపోవడానికి కారణం తిరుపతి మీటింగ్. గత కొన్ని రోజుల క్రితం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను పర్యవేక్షించే ఈసీ తమ మీటింగ్‌ను తిరుపతిలో నిర్వహించారు. ఈ మీటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈసీ రెండు నెలల క్రితం మీటింగ్‌ను తిరుపతిలో నిర్వహించింది. ఇప్పుడు హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఛాంబర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిల్లో హైదరాబాద్‌లో మీటింగ్ నిర్వహించడం వల్ల వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉందని తిరుపతిలో నిర్వహించారు. దీనిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో వ్యతిరేకత వస్తుంది. ఈ మీటింగ్ లు ఏంటి అంటూ ప్రశ్నస్తున్నారు. అంతే కాదు… ఈ ఈసీ మీటింగ్‌తో ఫిల్మ్ ఛాంబర్ కూడా రెండు చీలిపోయింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
పెద్దల సైలెన్స వీడాలి..
ఇండస్ట్రీని కాపాడాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి పదవుల కోసం ఇలా కొట్టుకోవడం అసహ్యంగా ఉంది అంటూ ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. అసలు సమస్యను పరిష్కరించి… మళ్లీ ఫిల్మ్ ఛాంబర్ కు పాత రోజులు తీసుకురావాలని అంటున్నారు. అయితే అది కేవలం సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి పెద్దలతోనే అవుతుంది.
ఈ పెద్దలు సైలెన్స్ వీడి.. ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న ఈ పదవుల సమస్యను పరిష్కరించాలని అంటున్నారు.