Tollywood workers Strike: సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె(Workers Strike) ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్మికులు గత వారం రోజులుగా సమ్మె నిర్వహిస్తూ తమకు 30 శాతం వేతనాలు పెంచాలి అని డిమాండ్లు చేస్తున్నారు. అయితే కార్మికులు అడిగినంత మొత్తంలో వేతనాలు ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా లేని నేపథ్యంలో గత వారం రోజులుగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేసి సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం ముగిసినప్పటికీ కార్మికుల సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదని చెప్పాలి.
సమ్మె మరింత ఉదృతం…
ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో భాగంగా సినీ కార్మిక సంఘాల ఫెడరేషన్ నాయకుడు అనిల్ వల్లభనేని (Anil Vallabha Neni) ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాతలు ఈ సమావేశంలో భాగంగా చెప్పినా అంశాలు మాకు నచ్చలేదని తెలియజేశారు. తాజాగా ఈ చర్చలు కూడా ఫలించలేదని తదుపరి తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. నిర్మాతలు మేము చెప్పిన డిమాండ్లకు ఒప్పుకోవడం లేదు.. అలాగే నిర్మాతల నిర్ణయాలు కూడా మాకు నచ్చలేదని వెల్లడించారు. మాకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగుకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇండస్ట్రీలో కార్మికుల వేతనాల మధ్య కూడా వ్యత్యాసాలు ఉన్నాయని అలాంటి తేడాలు చూపించవద్దని వెల్లడించారు.
విడదీసే ప్రయత్నం చేస్తున్నారు…
నిర్మాతలు ఫెడరేషన్ ని అలాగే యూనియన్ ను విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాతలు ఇచ్చిన పర్సెంటేజ్ మాకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు. రోజువారి కార్మికుల వేతనాలు అందరికీ ఒకేలాగా పెంచాలని, 13 యూనియన్ కార్మికులకు పెంచాలని మేము డిమాండ్ చేయగా, వాళ్ళు మాత్రం 10 యూనియన్స్ కార్మికులకు మాత్రమే పెంచుతామని తెలిపారు. ఇందులో ఫైటర్స్, డాన్సర్, టెక్నీషియన్లకు పెంచడం లేదని అందుకే నిర్మాతల డిమాండ్లను మేము ఒప్పుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
పీపుల్స్ మీడియా పై లీగల్ ఫైట్..
ఇలా నిర్మాతలు మా డిమాండ్లకు ఒప్పుకొని నేపథ్యంలో సమ్మె ఇలాగే కొనసాగుతుందని అయితే మేము పాదయాత్రలు చేయకుండా అందరం కలిసి చర్చలు జరిపి రేపు అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ వద్ద నిరసనలు చేస్తామని వెల్లడించారు.. సోమవారం తిరిగి మా అంశాలను మరోసారి ఛాంబర్ కు తెలియజేస్తామని అనిల్ వల్లభనేని తెలిపారు. ప్రస్తుతం కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయని, ఎవరికైతే 30% చెల్లిస్తున్నారో వారు మాత్రమే షూటింగ్ పనులలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇక కార్మికులపై పీపుల్స్ మీడియా ఇటీవల విడుదల చేసిన నోటీసుల గురించి కూడా స్పందించారు. ఈ నోటీసులపై తాము లీగల్ గా పోరాటం చేస్తామని ఇప్పటివరకు కార్మికులకు పీపుల్స్ మీడియా సుమారు 90 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది అంటూ సినీ కార్మిక సంఘాల ఫెడరేషన్ నాయకులు ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి కార్మికుల డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోని నేపథ్యంలో ఈ సమ్మెకు మరింత ఉధృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
Also Read: Big Tv Kissik Talks: అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!