Veturi Sundararama Murthy:తనదైన కామెడీ సినిమా లతో ఆడియన్స్ ని అలరించిన శివ నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తితో కలిసి పనిచేసిన అనుభవాలను ఇలా వివరించారు. వేటూరితో పాట రాయించుకోవడానికి అసలు ఏం చేయాలో ఇలా ఆసక్తికరంగా వివరించారు .
తాను విజయ గార్డెన్స్‌లో వేటూరి కోసం ఎదురుచూస్తూ ఉండేవాడినని, అక్కడ కోదండరామిరెడ్డి, ఆనంద్, రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి వంటి వారు కూడా ఉండేవారని తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.వేటూరి అక్కడికి వచ్చిన తర్వాత వినాయకుడి గుడికి వెళ్లి నమస్కారం చేసుకునేవారట. ఆ తర్వాత ఎవరిని తనతో తీసుకెళ్లాలనిపిస్తే వారిని కారులో ఎక్కించుకునేవారు. అలా కారులో ప్రయాణిస్తూ ఎన్నో విషయాలు మాట్లాడేవారని చెప్పారు.
మహాత్మా గాంధీ నుంచి అనేక అంశాల వరకు తనకు తెలిసిన విషయాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారట. మధ్యలో కొన్ని చోట్ల ఆగి కవర్లు ఇచ్చి రావాలని చెప్పేవారని, ఆ ప్రయాణంలోనే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉండేదని తెలిపారు.
వేటూరి గొప్పతనం ఏంటో అప్పుడే తెలిసింది!
వేటూరి పాటలు రాయడానికి కూర్చున్నప్పుడు ఆయనలో మరో కోణం కనిపించేదని శివ నాగేశ్వరరావు చెప్పారు. ముందుగా సినిమా సీన్ గురించి వివరిస్తే చాలు.. వెంటనే పాట రాయడం మొదలుపెట్టేవారట. తాము వేగంగా రాయకపొతే ఆయనే ప్యాడ్, పేపర్ తీసుకుని ఆయనే స్వయంగా రాసేవారని తెలిపారు.
ఇక వేటూరి ఒకే పల్లవికి మూడు నాలుగు రకాల వెర్షన్లు రాసి చూపించేవారట. దర్శకుడు క్రాంతికుమార్‌కు చూపించి ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చేవారని చెప్పారు. ఒక్కోసారి వేర్వేరు పల్లవుల్లో నచ్చిన లైన్లను తీసుకుని, వాటన్నింటినీ కలిపి మరో కొత్త పల్లవి తయారు చేసేవారట.
పది నిమిషాల్లోనే పాట
ఇదంతా చాలా వేగంగా జరిగిపోయేదని, కొన్నిసార్లు కేవలం పది నిమిషాల్లోనే పాట పూర్తయ్యేదని శివ నాగేశ్వరరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేటూరి పాటలు రాసే వేగం, పదాలను ఎంచుకునే విధానం, సన్నివేశానికి తగ్గట్టుగా పాటని అందించే తీరు అసాధారణమని ఆకాశానికి ఎత్తేశారు.
వేటూరి పాట రాయడానికి వచ్చినప్పుడు తమ భోజనం గురించి కూడా ప్రత్యేకంగా పట్టించుకునేవారని చెప్పారు. ఉదయం అల్పాహారం చేయలేదని తెలిస్తే తనతో పాటు భోజనానికి తీసుకెళ్లేవారట. పెట్రోల్ ఖర్చులు, భోజన ఖర్చులు వంటి వాటిని కూడా ఆయనే భరించేవారని, పాటకు తీసుకునే పారితోషికం తప్ప నిర్మాత నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా ఆశించేవారు కాదని ఆనాటి రోజులని సరదాగా గుర్తుచేసుకున్నారు శివ నాగేశ్వరరావు.
ALSO READ :దాసరి నారాయణరావుతో ఆ సంఘటన.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!