Zubeda Ali:టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ భార్య జుబేదా అలీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన ఎన్నో ఆసక్తికరమైన, విషయాలను ఇలా పంచుకున్నారు. ఈ మధ్యే గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న ఆమె.. తన ఆరోగ్య పరిస్థితి నుంచి తల్లి దండ్రుల వరకు ఎన్నో విషయాలను గుర్తుచేసుకున్నారు.
తల్లి మరణించినప్పుడు కూడా అలీ షూటింగ్‌లోనే..
తన జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన సంఘటనల్లో తల్లి మరణం ఒకటని జుబేదా చెప్పారు. భోగి రోజున తన తల్లి చనిపోయారని, ఆ సమయంలో తాము అలీతో కలిసి వైజాగ్‌లో ఉన్నామని తెలిపారు.వైజాగ్‌కు వెళ్లిన తర్వాత తల్లికి ఫోన్ చేసి తాను అక్కడికి వచ్చినట్లు చెప్పారట. అయితే షూటింగ్ ఉండటంతో ఇంటికి రాలేనని చెప్పడంతో తల్లి మరోసారి వీలు చూసుకుని రావాలని చెప్పారట. అదే రోజు సాయంత్రం తన తల్లి చనిపోయిందని తన సోదరుడి నుంచి ఫోన్ వచ్చిందని చెబుతూ కన్నీళ్ళు పెట్టుకుంది జుబేదా .
ఇక అలీ వెంటనే కారు ఏర్పాటు చేయడంతో తాను కుమార్తెతో కలిసి మండపేటకు బయలుదేరినట్లు చెప్పారు. అయితే భారీ షూటింగ్ ఏర్పాటు చేయడంతో అలీ వెంటనే రాలేని పరిస్థితి ఏర్పడిందట. హైదరాబాద్ నుంచి చాలామంది ఆర్టిస్టులను తీసుకెళ్లి షూటింగ్ పెట్టినందున ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చింది.
అయితే మరుసటి రోజు ఉదయం షూటింగ్ పూర్తయ్యాక అలీ డైరెక్ట్ గా బయలుదేరి వచ్చారని చెప్పారు. అయితే తన తల్లి బతికున్నప్పుడు కూడా అలీ ఎదురుగా రావడానికి సిగ్గుపడేవారని, ఆయనతో నేరుగా మాట్లాడేవారు కాదని గుర్తుచేసుకున్నారు. అత్తయ్య అంటూ అలీ పిలిచినా తల్లి బయటకు వచ్చేవారు కాదట. అలాంటి పరిస్థితుల్లో తల్లి మరణించినప్పుడు కూడా అలీ ఆమె ముఖం చూడలేకపోవడం తనకు ఇప్పటికీ బాధ కలిగిస్తుందని జుబేదా చెప్పుకొచ్చారు.
ఇంటి గృహప్రవేశం రోజున కూడా
ఇక అలీ బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబంలో ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ ని మిస్ చేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారట. అందరినీ ఆహ్వానించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో అలీకి షూటింగ్ నుంచి ఫోన్ వచ్చిందట. కేవలం గంటసేపు వెళ్లి వస్తానని చెప్పడంతో జుబేదా కూడా పంపించారట. కానీ వెళ్లిన అలీ రాత్రి రెండు గంటల వరకు తిరిగి రాలేదని తెలిపారు.
అప్పటికే గెస్టులు వచ్చేయడంతో వారందరినీ పలకరించడం, ఇంటిని చూపించడం, భోజన ఏర్పాట్లు చూసుకోవడం ఇలా అన్నీ తానే చూసుకోవాల్సి వచ్చిందట. లోపల చాలా బాధగా అనిపించినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీచూసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.రంజాన్‌తో పాటు ఎన్నో పండుగలను కూడా అలీ షూటింగ్ కారణంగా కుటుంబంతో కలిసి జరుపుకోలేకపోయారని వాపోయారు.
అయితే ప్రతి ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా కలిసి జరుపుకుందామని తనకు తానే సర్దిచెప్పుకునేదాన్నని తెలిపారు. ఇప్పుడు తన త్యాగాలను అలీ గుర్తించి అభినందిస్తున్నారని, మన కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి నువ్వు చేసిన త్యాగాలే కారణమని చెబుతుంటారని సంతోషంగా చెప్పుకొచ్చారు జుబేదా.
ALSO READ :మనీష్ మల్హోత్రా పార్టీలో సారా గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేం!