Vidya Balan: బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి బాలీవుడ్ అయినా కూడా డర్టీ పిక్చర్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. అసలు ఒకప్పుడు సిల్క్ స్మిత ఇలానే ఉండేదేమో అన్నంత హాట్ గా ఆ సినిమాలో విద్యా బాలన్ కనిపించింది. ఆ ఒక్క సినిమా ఆమెను స్టార్ గా నిలబెట్టింది. ఇక ఈ సినిమా తరువాత తెలుగులో కూడా విద్యా కనిపించింది. నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో ఆమె కనిపించింది.
ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించగా.. ఆయన భార్య బసవతారకం గా కనిపించింది విద్యా బాలనే. నిండైన చీర, నుదుటిన పెద్ద బొట్టు.. కొప్పు నిండా పూలతో చేతులెత్తి దండం పెట్టేలా ఉండే బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా విద్యా బాలన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో కనిపించలేదు. హిందీలోనే మంచి వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ అంటేనే నాజూకు నడుముకు అడ్డా. అంటే గ్లామర్. ఎప్పుడూ బాలీవుడ్ లో ఉండే నటీమణులు ఆ గ్లామర్ కోసం కసరత్తులు చేస్తూనే ఉంటారు. కానీ, వాటికి విద్యా బాలన్ విరుద్ధం. ఆమె గ్లామర్ లో హైలైట్ అయినా కూడా బరువు విషయంలో మాత్రం ఇప్పటికీ ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బరువు గురించి, ట్రోల్స్ గురించి మాట్లాడింది. ” నేనొక సిగ్గులేని ఆడదాన్ని. నాకు ఆత్మ విశ్వాసం ఎక్కువ. బరువు పెరిగానని ఏడుస్తూ కూర్చులేను. వెనక్కి తగ్గలేదు. అలా బరువు ఉన్నప్పుడే లీడ్ రోల్స్ లోనే నటించాను. నేను బరువు ఉన్నాను.. ఆ పాత్ర నాకు సెట్ అవ్వదేమో అనే అభద్రతా భావం నాలో ఎప్పుడూ లేదు. చుట్టూ జనాలు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా.. బరువు తగ్గాలని సూచించాలని చెప్పినా కూడా నాలో ఏ తప్పు లేదన్నప్పుడు నేనెందుకు బాధపడాలి.
నేను బరువు తగ్గడానికి చాలా చేశా. వ్యాయామాలు, డైట్, నాన్ వెజ్ మొత్తం మానేశా. ఏడాది పొడవునా కూరగాయలు మాత్రమే తిన్నా. చాలావరకు తగ్గాను. అయితే కొన్ని నెలలు మాత్రమే అలా తగ్గుతున్నాను. ఆ తరువాత మళ్లీ యధాస్థితికి చేరుకున్నాను. అయినా కూడా నేను చేస్తూనే వస్తున్నాను.ఇక ప్రతి మనిషికి అన్ని కూరగాయలు సూట్ కావు. వారి బాడీకి సరిపడే కూరగాయలు మాత్రమే తినాలి” అని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం విద్యా బాలన్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇంకోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది.