AP Metro Rail Project: విజయవాడ, విశాఖపట్నం నగరాల మెట్రో రైళ్ల కల నిజం కానుంది. ఎన్నేళ్లుగా చర్చలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్, రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా మరింత అవసరమైంది. ఇప్పటి వరకు ఆలస్యమైన ఈ కలల ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, టిప్సా, శిస్ట్రా కన్సల్టెన్సీల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
❄ విశాఖ, విజయవాడ మెట్రోకు సరికొత్త దిశ
మంత్రి నారాయణ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. విజయవాడ మెట్రోకు టిప్సా కన్సల్టెన్సీ, విశాఖ మెట్రోకు శిస్ట్రా కన్సల్టెన్సీ సాంకేతిక సహకారం, డిజైన్‌లు, పనుల పర్యవేక్షణలో భాగస్వామ్యం అవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలపై ఈ రెండు సంస్థలు ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్ళబోతున్నాయి. ఇది కేవలం అవగాహన ఒప్పందమే కాకుండా, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రవాణా విధానంలో విప్లవాత్మక మార్పుకు నాందిగా ప్రభుత్వం అంటోంది.
❄ రాష్ట్ర విభజన చట్టం హామీ.. అమలులో కొత్త ఉత్సాహం
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, ఏపీలో రెండు నగరాల్లో మెట్రో నిర్మాణం తప్పనిసరి. కానీ ఇప్పటివరకు ఇది కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినందున ప్రాజెక్ట్ కదలలేకపోయిందని కూటమి అంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యతగా తీసుకుని పనులు వేగవంతం చేస్తోందని కూటమి నేతలు అంటున్నారు.
❄ ఫండింగ్ మోడల్.. స్పష్టమైన రోడ్‌మ్యాప్
మెట్రో ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమీకరించే విధానం కూడా ఖరారు చేసింది. కేంద్రం 20 శాతం, రాష్ట్రం శాతం, మిగతా 60 శాతం కేంద్రం తక్కువ వడ్డీతో ఇచ్చే లోన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. విశాఖ మెట్రో కోసం వీఎంఆర్డీఏ నుంచి, విజయవాడ మెట్రో కోసం సీఆర్డీఏ నుంచి నిధులు తీసుకుంటున్నారు.
❄ టెండర్ల ప్రక్రియ.. వేగం పెరిగిన మెట్రో పనులు
విశాఖ మెట్రో రైల్ ఫేజ్-1 కింద 46.23 కి.మీ. పొడవునా టెండర్లు ఇప్పటికే పిలిచారు. ఇదే తరహాలో విజయవాడ మెట్రో ఫేజ్-1 కింద 35.04 కి.మీ. నిర్మాణం కోసం రేపో ఎల్లుండో టెండర్లు విడుదల కానున్నాయి. టెండర్ల ప్రక్రియతో మెట్రో ప్రాజెక్ట్‌కు కొత్త ఉత్సాహం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
❄ డబుల్ డెక్కర్ ప్రత్యేకత.. దేశంలో అరుదైన ప్రాజెక్ట్
మెట్రో ప్రాజెక్టులో మరో ఆకర్షణ డబుల్ డెక్కర్ నిర్మాణం. విశాఖలో 20 కి.మీ. మేర, విజయవాడలో 4.7 కి.మీ. మేర డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది దేశంలో అరుదైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని రవాణా నిపుణులు పేర్కొంటున్నారు.
❄ మూడేళ్లలో పూర్తి లక్ష్యం
ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లను మూడు సంవత్సరాల లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైళ్లు దూసుకెళ్తున్న దృశ్యం చూడటానికి ఇంకెంత దూరం లేదని మంత్రి నారాయణ చెబుతున్నారు. టిప్సా, శిస్ట్రా కన్సల్టెన్సీలతో కలసి ఈ లక్ష్యాన్ని సమయానికి చేరుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
❄ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌లు నగరాల్లో ప్రధాన సమస్యగా మారాయి. మెట్రో రైలు నిర్మాణం మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. పర్యావరణహితమైన రవాణా విధానంగా మెట్రో రైళ్లు నగర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ ఎంఓయూ రెండు నగరాల కలలకు కొత్త ఊపు ఇచ్చింది. సముద్రతీర విశాఖలో మెట్రో రైలు, కృష్ణానది తీర విజయవాడలో మెట్రో ట్రాక్.. ఇది ఆంధ్రప్రదేశ్ రవాణా రంగానికి గర్వకారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెట్రో ప్రాజెక్టులు కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, నగరాల భవిష్యత్తు అభివృద్ధికి పునాది. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు రోడ్లపై నడిచే రోజు దూరం లేదని ఇప్పుడు స్పష్టమవుతోంది. తాజా ఎంఓయూ ఈ కలను వాస్తవానికి దగ్గర చేసింది.