Betting Apps Case : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బెట్టింగ్ యాప్స్. దీని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పూర్తిగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని.. పాన్ ఇండియా స్టార్స్ వరకు చాలామంది డబ్బు కోసం కక్కుర్తిపడి తమకు జీవితాన్ని కల్పించిన ప్రజల జీవితాలను పణంగా పెట్టి, ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు డబ్బు సంపాదించారు. అయితే వీరిని నమ్మి ఎంతోమంది ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి, అప్పుల పాలై, వాటిని కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారిపై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి పాలిట యమగండం గా మారారు. ఇక ప్రస్తుతం దాదాపు చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆగిపోయిన విషయం తెలిసిందే.. పలువురు సెలెబ్రిటీలకు నోటీసులు అందగా నేడు హీరో విజయ్ దేవరకొండ విచారణకు హాజరుకారున్నారు.
ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఈడీ అధికారులు విజయ్ దేవరకొండకు నోటీసులు పంపారు. ఈ విచారణ నేపథ్యంలో ఈయన ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించగా.. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నటుడైన రానా కు కూడా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి కూడా ఆగస్టు 13న విచారణకు రావాలని నోటీసులు పంపారు. మరికొంతమందికి కూడా నోటీసులు అందాయి.. త్వరలోనే బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read: ‘కూలీ’లో నాగార్జున క్యారక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?
5 గంటల పాటు ప్రకాష్ రాజ్ విచారణ..
ప్రచారణలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రకాష్ రాజ్ జూలై 30 న ఈడీ ముందు హాజరయ్యారు. అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్, హవాలా లావాదేవీలపై విచారణ జరిపి.. ప్రకాష్‌రాజ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు ఈడీ అధికారులు. ఈ క్రమంలోనే దుబాయ్‌కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఈడీ.. ప్రకాశ్‌రాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.. ఈయన జంగల్ రమ్మీ అనే యాప్ ని ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ తో పాటుగా మొత్తం 29 మందికి నోటీసులు పంపింది ఈడీ. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ల కారణం ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది.