V.N.Adithya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా కార్మికుల సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె కారణంగా పెద్ద సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకు దాదాపు చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ఈ షూటింగులు ఆగిపోవడంతో అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి రెండు వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్.. 30% వేతనం పెంచాలి అని డిమాండ్ చేస్తూ షూటింగులు ఆపేసి మరీ నిరసన తెలుపుతున్నారు. అయితే నిర్మాతలు ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. యూనియన్ లీడర్స్ పనిచేసే వాళ్లను కూడా చెడగొడుతున్నారు ఇప్పుడు సినిమాలు సరిగా ఆడక నిర్మాతలు ఇబ్బందులు పడుతుంటే.. వేతనాలు ఎలా పెంచుతారు అంటూ తమ సమస్యలను చెప్పుకొచ్చారు.
ఫెడరేషన్ నేతల సమ్మెపై డైరెక్టర్ మండిపాటు..
కానీ ఫెడరేషన్ నేతలు మాత్రం నిర్మాతలపై మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ దర్శకులు వి.యన్.ఆదిత్య (VN Adithya) సమ్మె తీరుపై తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సినీ కార్మికుల సమ్మెపై స్పందిస్తూ.. “ఒక వ్యక్తి సినిమాల్లోకి వచ్చి.. డబ్బులు వస్తేనే తీస్తాను. రాకపోతే వేరే వ్యాపారంలో పెడతాను అనుకోకుండా.. లాభం వచ్చినా.. నష్టం వచ్చినా సినిమాలే తీస్తూ బయట వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగం మీదే పెడుతూ.. ఈ రంగంలో పదేళ్లలో దాదాపు రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టుకొని.. అటు ఫ్లాప్ లను ఇటు ట్రోలింగ్ ను ఎదురీదుతూ మొండిగా తట్టుకొని నిలబడితే.. అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. అబద్ధపు ప్రచారాలతో.. స్వార్థపూరిత రాజకీయాలతో కుల వివక్షత చూపిస్తూ నిర్మాతను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
సమ్మె వల్ల నష్టపోయేది కార్మికులే – డైరెక్టర్
ఇలా చేస్తే ఎవరికి రా నష్టం.. 50 సినిమాలకు 200 మందికి పైగా పదేళ్లలో ఆయన పెట్టిన మూడు పూటల భోజనం ఖర్చు మాత్రమే ఒక 10 పెద్ద సినిమాల బడ్జెట్ అవుతుంది. కారు డ్రైవర్లకు, ప్రొడక్షన్ బాయ్స్ కి డబ్బులు ఎగరగొట్టి.. హీరో, హీరోయిన్లకు మాత్రమే డబ్బులు ఇచ్చి ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్లుగా ఫోజు కొడుతున్న చాలామంది నిర్మాతలను ఒక్క మాట అనలేని యూనియన్ లీడర్లు.. వీరిపైన విరుచుకుపడుతున్నారు. ఏ కార్మిక సంఘం అయినా వర్కర్ కి అన్యాయం చేసిన ప్రొడ్యూసర్ పై పడాలి కానీ వేల మంది వర్కర్స్ కి పని కల్పించే ప్రొడ్యూసర్స్ మీద కాదు.. ఈ సమ్మె వల్ల కడుపులు కాలుతున్న కార్మికులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళ ఆకలి బాధలకు ఏ యూనియన్ నాయకుడు సమాధానం చెబుతాడు.
యూనియన్ నాయకుల వల్లే ఇదంతా..
కళా రంగంలో పని దొరకడమే మొదటి ప్రాధాన్యత. సినీ ఇండస్ట్రీకి కష్టం వస్తే యూనియన్ నాయకుడు అనే వాడు అండగా నిలబడి.. ఒకరోజు షూటింగ్ జరిగేందుకు దోహదపడాలి కానీ.. షూటింగ్లకు అంతరాయం కలిగించకూడదు.. పనుంటే గాని డబ్బు, అన్నం దొరకని పరిశ్రమలో పని ఆపి ఎవరూ ఎవరిని ఉద్ధరించలేరు. నేను ఏ యూనియన్ లో అయినా సాధారణ సభ్యుడినే కానీ ఏ పదవిలోనూ లేను. నాకేం తెలుసని ఈ పోస్ట్ పెట్టానని ఎవరైనా అనుకుంటే… 35 ఏళ్లుగా సినిమా రంగంలో వస్తున్న ప్రతి మార్పుకి ప్రత్యక్ష సాక్షిని నేను.. నా అనుభవాన్ని మించిన అర్హత ఇంకోటి కావాలా? ” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ సినీ కార్మికుల పొట్టకూటిపై కొడుతున్న యూనియన్ లీడర్లపై మండిపడ్డారు డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య. సమస్య వస్తే పరిష్కరించాలి కానీ సమస్యను సృష్టించకూడదు అంటూ స్పష్టం చేశారు. మరి దీనిపై యూనియన్ లీడర్లు ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
ALSO READ:Film industry: విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన జంట!