Joint Travel Pass: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజు వారి ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
జాయింట్ పాస్‌ల ధరలు సగానికి పైగా కోత!
రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించినట్లు తెలిపారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుందని, సాధారణ ఉమ్మడి పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు
సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికులతో వ్యవహరించిన తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారిని గౌరవంగా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట డీఎం స్థాయి అధికారి కుర్చీలో కూర్చొని ఉండగా, కార్మికులు కింద కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన అంశంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీతో మాట్లాడి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆదేశించారు. విచారణలో ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని, అధికారులు కార్మికుల పట్ల గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా మెలగాలని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: మీ ఫ్యాషన్.. హైదరాబాద్ భవిష్యత్తును బూడిద చేస్తోందా?