Dengue Alert in Bengaluru: ఉత్తర భారతదేశంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వేడితో వణికిపోయిన దక్షిణ భారతదేశం ప్రస్తుతం చల్లటి వాతావరణాన్ని చూస్తుంది. ఈ తరుణంలో కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వర్షాకాలం మొదలు కావడంతో సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నాయి. తాజాగా బెంగుళూరులో డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి.
గత ఏడాదితో పోలిస్తే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేవలం బెంగుళూరు పరిధిలో గత మూడు వారాల్లో 1,036 కి పైగా కేసులు నమోదయ్యాయి. జూన్ 2023తో పోలిస్తే, రెండు రెట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. డెంగ్యూ పాజిటివ్‌గా తేలిన వారిలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ కూడా ఉన్నారు.
వైద్య అధికారులకు ఆదేశాలు కర్ణాటక సీఎం ఆదేశాలు
నగరంలో డెంగ్యూ కేసుల వ్యాప్తిని నియంత్రించేందుకు మహానగర పాలికే (BBMP) ఆరోగ్య అధికారులు విస్తృతంగా పనిచేస్తున్నారు. వారు ఇంటింటికి సర్వేలు, ఫాగింగ్-స్ప్రేయింగ్, అవగాహన ప్రచారాలపై దృష్టి సారిస్తున్నారు. వ్యాధి వ్యాప్తికి మూలకారణమైన దోమల ఉత్పత్తి కేంద్రాలను తొలగించేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక దృష్టి సారించాలని, డెంగ్యూ కేసులను గుర్తించి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావుతో కూడా సమావేశమై చికిత్స, మందుల లభ్యతపై దృష్టి సారించారని కూడా కోరారు.
Also Read: Lightning Strikes Bihar Girl Safe: బీహార్ షాకింగ్ ఘటన, పిడుగు నుంచి తప్పించుకున్న బాలిక
డెంగ్యూపై ప్రభుత్వ అధికారులతో సమావేశమై చర్చించడమే కాకుండా, కర్ణాటక ముఖ్యమంత్రి ప్రజలకు కూడా కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ సహకరించి, రాష్ట్ర అధికారులతో సమన్వయంతో పని చేయాలని, తద్వారా వ్యాధిని ఎదుర్కోవడానికి సహాయమవుతుందని అన్నారు. అధికారులు జారీ చేసిన సూచనలను ప్రజలు పాటించాలని, తమ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కాగా, భారీ వర్షాల కారణంగా ఇళ్ల చుట్టూ నిలిచిపోయే నీటితో కూడా దోమలు, కీటకాలు తిరుగుతూ వైరస్, ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేస్తుంటాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఎదురయ్యే వైరస్ ల పట్ల పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు.