Adulterated Liquor: ఏ వస్తువు పట్టు కున్నాకల్తీ మాట బలంగా వినిపిస్తోంది. ఒక్క వస్తువు అని ప్రత్యేకంగా చెప్పలేము. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అందుకు మరొక నిదర్శనం. తాజగా కల్తీ మద్యం కాటుకు 15 మంది మృతి చెందారు, మరో 180 మంది ఆసుపత్రి పాలయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన మణిపూర్‌లో వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది?
మణిపూర్‌ని నిన్నటి వరకు జాతుల మధ్య కుదిపేసింది. అది కాస్త తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో.. కల్తీ మద్యం అక్కడి కొందరి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. చందేల్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 15 మంది మరణించారు. మరో 180 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువమంది చక్పి కరాంగ్ తోపాటు మిగతా ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు.
ఈ ఘటనలు నవంబర్ 18 నుంచి 20 మధ్య జరిగాయి. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందేల్ జిల్లా పోలీసులు జారీ చేసిన అధికారిక ప్రకటనలో తొలుత 8 మంది మరణించారని పేర్కొన్నారు. అది కాస్త రెట్టింపు అయ్యింది. పోలీసుల సమాచారం ప్రకారం.. కొంత మంది బాధితులు వారి నివాసాల్లో మరణించగా, మరి కొందరు ఆసుపత్రులకు వెళ్లే మార్గంలో కొందరు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేరిన తర్వాత ఇంకొందరు మరణించారు. ఆ జిల్లా ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. ఆరోగ్య శాఖ.. అక్కడి మిగతా ఆసుపత్రుల నుండి సహాయం కోరింది.
బాధితులు సేవించిన మద్యం కాక్చింగ్ జిల్లాలోని సుగాను నుండి కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మద్యంలో మిథనాల్ కలిపినట్లు తెలుస్తోంది. చందేల్ జిల్లాలో స్థానికంగా ఉత్పత్తి చేసిన మద్యం గురించి ఎలాంటి సమాచారం లేదు. మద్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయించారని భావిస్తున్నారు. మద్యం తయారీదారుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ALSO READ: పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!
ముందస్తు జాగ్రత్తగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రభావిత ప్రాంతాల్లో స్థానికంగా తయారు చేసిన మద్యం, ఏదైనా మూలాల నుండి లభించే మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని కోరారు. మద్యం సేవించిన తర్వాత వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, కళ్లు తిరగడం, దృష్టి మసక బారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వైద్య సహాయం తీసుకోవాలని ప్రస్తావించారు. సీఎం ఖేమ్‌చంద్ సింగ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడారు.