మా కాలేజీలో చేరితే ప్లేస్ మెంట్ గ్యారెంటీ
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్ గ్యారెంటీ
వందశాతం స్టూడెంట్స్ కి జాబ్ లు ఇప్పించిన రికార్డ్ మాది..
ఇంజినీరింగ్ కాలేజీల ప్రచారం ఇలాగే ఉంటుంది. కానీ ఆ కాలేజీకి ప్రచారం అక్కర్లేదు, ఆ మాటకొస్తే అక్కడ చేరాలని ఎవరూ ఎవర్నీ బతిమిలాడరు. సీటు దొరికితే చాలు అని ఆశపడుతుంటారు. అదే IIT ఇండోర్. వాస్తవానికి ఏదో ఒక ఐఐటీలో సీటు తెచ్చుకోవాలని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు. అందుకే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలతో కుస్తీలు పడుతుంటారు. అయితే ఆ ఐఐటీల్లో కూడా కొన్నిటిలో సీటు దొరకాలంటే మాత్రం ఎక్కడలేని కాంపిటీషన్ ఉంటుంది. ఆ లిస్ట్ లో ఇండోర్ ఐఐటీ ఒకటి.
కోటి రూపాయల జీతం..
ఐఐటీ క్యాంపస్ లో బీటెక్ పూర్తి చేసి బయటకు వస్తే లక్షల రూపాయల జీతం ఇవ్వడానికి కంపెనీలు క్యూలో ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఐఐటీల్లో చదివినా ఉపాధికోసం మరింత కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. కానీ ఐఐటీ ఇండోర్ మాత్రం వీటికి భిన్నంగా ఉంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉపాధి వేటలో ముందున్నారు. నియామకాల్లో ఐఐటీ ఇండోర్ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఇండోర్ లో చదువుకున్న ఐదుగురు విద్యార్థులు కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనాన్ని పొందారు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన వెంటనే వారికి కోటి రూపాయల జీతం ఆఫర్ చేస్తూ అపాయింట్ మెంట్ లెటర్లను చేతిలో పెట్టాయి కంపెనీలు. ఒక్కో ఏడాది ఒకరో ఇద్దరికో ఇలాంటి లక్కీ ఛాన్స్ తగులుతుంది. కానీ ఐఐటీ ఇండోర్ లో గరిష్టంగా ఐదుగురు విద్యార్థులు కోటి రూపాయల వార్షిక వేతనానికి ఎంపిక కావడం ఒక రికార్డ్. శాలరీ విషయాన్ని పక్కనపెడితే 500 మంది విద్యార్థులు టాప్ క్లాస్ కంపెనీలకు రిక్రూట్ అయ్యారు.
ప్లేస్ మెంట్స్ లో టాప్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఎక్కడ చదివారు, ఎన్ని మార్కులొచ్చాయి అనే విషయాల్ని ఎవరూ పరిగణలోకి తీసుకోవడంలేదు. కొత్త ట్రెండ్స్ ని పసిగట్టి, కొత్త కోర్సులను ఎంపిక చేసుకుంటేనే భవిష్యత్ లో ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తేలిపోయింది. మధ్యప్రదేశ్‌లోని IIT ఇండోర్ ఈ విషయంలో తమ స్టూడెంట్స్ కి నూటికి నూరు శాతం న్యాయం చేస్తోంది. 2023లో ఐఐటీ ఇండోర్ నుంచి ఒక విద్యార్థికి వార్షిక వేతనం కోటి రూపాయలు దక్కింది. 2024లో ఐదుగురు విద్యార్థులు కోటి రూపాయల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. 2024 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 500 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు లభించాయి. అంటే కాలేజీలో చదువుకున్న 88 శాతం మంది ఫైనల్ ఇయర్ లో ఉండగానే మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వీరి సగటు వేతన ప్యాకేజీ రూ.27 లక్షలు కావడం గమనార్హం.
ఇక 34 దేశాలలో 118 అవగాహన ఒప్పందాలను ఐఐటీ ఇండోర్ కుదుర్చుకుంది. ఇక్కడ 220 మంది అధ్యాపకులు ఉన్నారు. 3,000 మందికి పైగా విద్యార్థులతో ఐఐటీ ఇండోర్ టాప్ క్లాస్ ఇన్ స్టిట్యూట్స్ లో ఒకటిగా నిలిచింది.