సికింద్రాబాద్-షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది. ఉదయం పశ్చిమ బెంగాల్ లోని హౌరా సమీపంలో రైలు మూడు కోచ్ లు పట్టాలు తప్పాయి. ఉదయం 5.31గంటలకు ఖరగ్ పూర్ డివిజన్ లోని సల్పూర్ స్టేషన్ గుండగా వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్ ప్రెస్ కు చెందిన పార్సిల్ వ్యాన్ తో పాటు ప్రయాణీకులు ఉన్న రెండు కోచ్ లు అదుపు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Also read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాదీలు మృతి
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితి పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను కిందకి దింపి ఇతర రైళ్లకు అంతరాయం కలగకుండా బోగీలను పక్కకు జరిపిస్తున్నారు. రైలు మధ్య పట్టాల మీద నుండి బయటి పట్టాలపైకి మారుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఖరగ్ పూర్ నుండి ప్రత్యేక రైల్లు ఏర్పాటు చేసి ప్రయాణీకులను తరలించారు. అంతే కాకుండా గమ్యస్థానం దగ్గరలోనే ఉన్నవారిని తరలించడానికి బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
పెరుగుతున్న రైతు ప్రమాదాలు:
ఇదిలా ఉంటే ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో 351 మంది ప్రాణాలు కోల్పోయారు. 970 మంది గాయపడ్డారు. మొత్తం 200 రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వరుస ప్రమాదాలపై గత నెల స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పదేళ్ల కిందట ఏడాదికి 171 ప్రమాదాలు జరిగితే ప్రస్తుతం ఆ సంఖ్య 40కి తగ్గిందని చెప్పారు.