Adani US Corruption Rahul | అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదానీ వ్యవహారాన్ని వ్యక్తిగత విషయంగా పేర్కొనడంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. అదానీ వ్యవహారం వ్యక్తిగత విషయం కాదు.. మొత్తం దేశానికి సంబంధించిన అంశమని రాహుల్ గాంధీ అన్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గ సందర్శనలో ఉన్న రాహుల్ శుక్రవారం లాల్గంజ్ ప్రాంతంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు.
ప్రధానమంత్రి మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ అదానీ వ్యవహారం వ్యక్తిగతమని, అలాంటి విషయాలు ఇద్దరు ప్రపంచ నేతలు మాట్లాడుకునేటప్పుడు ప్రస్తావనకు రావని చెప్పారు. అయితే అదానీకి వ్యతిరేకంగా నమోదైన అవినీతి, దొంగతనం కేసులు అమెరికాలో పెండింగ్ లో ఉన్నాయని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు.
వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన మిత్రుడని చెప్పుకున్న మోదీ, ఆయన గురించి ట్రంప్‌తో చర్చించలేదని కూడా రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి మోదీతో భేటీ అనంతరం ట్రంప్ కూడా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. రాహుల్ శుక్రవారం సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలోని లాల్గంజ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ జీ, ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు..దేశానికి సంబంధించినది. మీరు నిజాయితీ గల భారత ప్రధానమంత్రి అయితే అదానీ వివాదం గురించి ఆరాతీసేవారు. ఆరోపణలపై విచారణకు అవసరమైతే అదానీని అమెరికా పంపిస్తానని ట్రంప్‌తో చెప్పి ఉండేవారు. అలాంటిదేమీ లేకుండా, కేవలం వ్యక్తిగతమంటూ వదిలేశారు’అని రాహుల్ (Rahul Gandhi) ఎద్దేవా చేశారు.
Also Read: తమిళనాట మళ్లీ భాషా రాజకీయం.. కేంద్రంపై ముఖ్యమంత్రి ఫైర్
సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం అమెరికా కంపెనీలు భారత్‌లోని అధికారులకు రూ.2,100 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు గత బైడెన్ ప్రభుత్వంలోని న్యాయశాఖ ఆరోపించింది. ఇందులో అదానీ గ్రూప్ తో సంబంధమున్నట్లు తెలిపింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా అదానీ గ్రూపు ఖండించింది.
ఉత్తర్ ప్రదేశ్ 2027 ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలి
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. యూపీలో ఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు..ఘోరంగా విఫలమైన అసలు ఇంజినే లేని ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచిగా పనిచేస్తుండగా, యూపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత విఫలమైన ప్రభుత్వమని దుయ్యబట్టారు. 2027 సంవత్సరంలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యరకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, పార్టీ విజయం కోసం శ్రమించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం
యూపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదన్నారు. మరో వైపు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో మునిగిపోయిందని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా తయారు చేస్తుంది. నోట్ల రద్దు వల్లే అవినీతితోపాటు చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలను సృష్టించాలంటే మొదటగా చేయాల్సిన పని చిన్న పరిశ్రమలను బలోపేతం చేసి రక్షణ కల్పించడమే’ అని రాహుల్ సూచించారు.