మోదీ చైనా వెళ్లారు, మోదీ జపాన్ వెళ్లారు, మోదీ మాల్దీవ్స్ కి వెళ్లారు, మోదీ యూకే వెళ్లారు.. ఇలా ఈ ఏడాదిలోనే ఆయన 18 దేశాలు చుట్టి వచ్చారు. కానీ ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా ఆయన మణిపూర్ వెళ్లలేదు. ఆ మాటకొస్తే రెండున్నరేళ్లుగా ఆయన ఆ రాష్ట్రానికి మొహం చాటేశారు. దేశ విదేశాలు తిరుగుతున్న ఒక ప్రధాని, తాను ప్రధానిగా ఉన్న దేశంలోని ఒక రాష్ట్రానికి రెండున్నరేళ్లపాటు వెళ్లలేదంటే ఏంటి దానర్ధం? ఆ రాష్ట్రంపై ఆయనకు ఆసక్తి లేదనా, లేక ఆ రాష్ట్రంలో ఆయన పర్యటించేందుకు అనువైన పరిస్థితులు లేవనా? పోనీ ఆ పరిస్థితులు లేవంటే దానికి కారణం ఎవరు? రెండున్నరేళ్లుగా ఆ రాష్ట్రం రావణకాష్టంలా మారినా పట్టించుకోలేని ప్రధాని ప్రధాన ముద్దాయి కాదా? ఇలాంటి విమర్శలన్నీ చుట్టుముడుతున్న వేళ, ప్రధాని మోదీ తాజాగా మణిపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో రీఎంట్రీ ఇస్తున్నారు.
ముహూర్తం ఖరారు..
జాతుల ఘర్షణలతో మణిపూర్ అట్టుడికిపోతోంది. ఇప్పటికీ ఇంకా అక్కడక్కడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలీ గొడవలు మొదలై రెండున్నరేళ్లు జరుగుతోంది. ఇటీవల కాలంలో మోదీ అక్కడికి వస్తారు వస్తారు అంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ ఏదీ అధికారికం కాలేదు. కానీ ఇప్పుడు అది అధికారికంగా ధృవీకరణ అయింది. మోదీ మణిపూర్ వెళ్తున్నారు. ఈనెల 13వతేదీ మధ్యాహ్నం 12.20గంటలకు ఆయన మణిపూర్ చేరుకుంటారని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయెల్ ప్రకటించారు. చురాచంద్‌పూర్‌లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకొని సంఘీభావం ప్రకటిస్తారని తెలిపారు.
శంకుస్థాపనల మేళా..
మణిపూర్ లో అల్లర్లు జరిగిన సమయంలో బీజేపీ ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పర్యటనలో ఆయన 7,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని తెలుస్తోంది. పీస్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మణిపూర్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజధాని ఇంఫాల్ కి వెళ్లి అక్కడ మరో 1200 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తారు.
పరామర్శ..
మణిపూర్ లో మైతేయి, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో చురాచంద్‌పూర్ గ్రామం తీవ్రంగా నష్టపోయింది. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలవారు 260 మందికి పైగా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రధాని పర్యటన దృష్ట్యా మణిపూర్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చురాచంద్‌పూర్ జిల్లాలో ఎయిర్గన్లను నిషేధించారు. రాజధాని ఇంఫాల్, చురాచంద్ పూర్లోని పీస్ గ్రౌండ్ చుట్టూ రాష్ట్ర, కేంద్ర బలగాలు మోహరించాయి.
విమర్శలు..
రెండున్నరేళ్లుగా మణిపూర్ వైపు చూడని ప్రధాని.. తాజా పర్యటనలో కేవలం మూడు గంటలే ఆ రాష్ట్రానికి కేటాయించడం దారుణం అని విమర్శించారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఈ పర్యటన విషయంలో ఆయనకు అంత తొందరెందుకని అన్నారు. మణిపూర్ వాసులను ఆయన అవమానించినట్టేనని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం మోదీ పర్యటనను స్వాగతించడం విశేషం.