ఓవైపు శవాల గుట్టలు, మరోవైపు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం ఉన్నవారెవరైనా పార్టీలు చేసుకుంటారా, డీజే పెట్టి డ్యాన్స్ లు ఆడుతారా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఊగిపోతూ తూగిపోతూ రెచ్చిపోతారా..? కానీ వారు మాత్రం ఇవన్నీ చేశారు. మానవత్వం మంటగలిసిపోయిందని నిరూపించారు. ఈ తప్పుకి ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణ చెప్పింది. దీనికి కారణం అయిన నలుగురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగింది. ఎయిరిండియా సంస్థపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియాలో తమ సందేశాలను ఉంచారు.
వైరల్ వీడియో..
ఎయిర్ ఇండియా సంస్థ అంటే దేశంలోనే మంచి పేరుంది. అందులోనూ దాన్ని టాటా సంస్థ తీసుకున్న తర్వాత విలువలు, నిబద్ధత మరింత పెరుగుతాయని ఆశించారంతా. అనుకోకుండా ప్రమాదం జరిగింది, దానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన రోజుల వ్యవధిలోనే ఎయిర్ ఇండియా సిబ్బంది తమ ఆఫీస్ లో పార్టీ చేసుకుని, ఖుషీగా గడపడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 242మంది ప్రయాణిస్తున్న విమానంలో 241మంది చనిపోగా.. ఆ బాధ ఏమాత్రం లేకుండా పార్టీ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ ఇండియా సంస్థ తప్పు ఒప్పుకోవాల్సి వచ్చింది. AI 171 విషాదం నుంచి తాము ఇంకా బయటపడలేదని, బాధిత కుటుంబాలకు తమ కంపెనీ సంఘీభావంగా నిలుస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. విషాదాన్ని మరచి చిందులు వేస్తున్న సిబ్బందిలో నలుగురిని తొలగించారు.
A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.
The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd
— Mid Day (@mid_day) June 23, 2025
AISATS నిర్వాకం..
వాస్తవానికి ఇది పూర్తిగా ఎయిరిండియా నిర్వాకం అని చెప్పలేం. ఎయిర్ ఇండియాతో కలసి సింగపూర్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్ (SATS) ఉమ్మడి సంస్థగా AISATS ఏర్పడింది. కార్గో హ్యాండ్లింగ్ ని దీని ద్వారా నిర్వహిస్తుంటారు. ఈ సంస్థకు గుర్ గ్రామ్ సహా ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం గుర్ గ్రామ్ ఆఫీస్ లో జరిగిన పార్టీ సంచలనంగా మారింది. ఎయిర్ ఇండియా ప్రమాదం జూన్ 12న జరుగగా, ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే గుర్ గ్రామ్ లోని AISATS ఆఫీస్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి హాజరైన ఉద్యోగులు చిందులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు విమాన ప్రమాదం జరిగి అందరూ బాధలో ఉన్న సమయంలో ఇలా అదే సంస్థకు చెందిన ఉద్యోగులు పార్టీ చేసుకోవడం, చిందులు వేస్తూ వీడియోలు తీసుకోవడం సమంజసమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో AISATS సంస్థ నష్టనివారణ చర్యలు చేపట్టింది. నలుగురు సీనియర్ ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఘటన తమనెంతో బాధించిందని, అందుకే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు ఉన్నతాధికారులు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు. AISATS కి చెందిన కొందరు ఉద్యోగుల ప్రవర్తన తమ విలువలకు అనుగుణంగా లేదని వారు తెలిపారు. సానుభూతి, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ వారిపై చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు చెప్పారు.