సులేమాన్
అఫ్గాన్
జిబ్రాన్
పహల్గాంలో అమాయక టూరిస్ట్ లను అతి దారుణంగా కాల్చి చంపిన ఉగ్రవాదులు వీరు. ఈ ముగ్గుర్నీ తాజాగా భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఏరివేతకు ఆపరేషన్ మహదేవ్ అనే పేరు పెట్టారు. శ్రీనగర్ సమీపంలోని లిడ్వాస్ ప్రాంతంలోని దాచిగాం నేషనల్ పార్క్ సమీపంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఆపరేషన్ మహదేవ్ మొదలైంది. మహాదేవ్ రిడ్జ్ సమీపంలో జరిగిన ఘటన కావడంతో దీనికి ఆపరేషన్ మహాదేవ్ అనే పేరు పెట్టారు. అయితే దీని గురించి సైన్యం అధికారికంగా ఎక్కడా ప్రకటన విడుదల చేయలేదు. పార్లమెంట్ సమావేశాల్లో హోం మంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ గురించి ప్రస్తావించడం విశేషం.
ఆపరేషన్ సిందూర్ పై చర్చ..
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుండగా.. ఆపరేషన్ సిందూర్ ని తమ ఘనతగా చాటి చెబుతున్నారు ఎన్డీఏ నేతలు. ఈ క్రమంలో సోమవారం ఆపరేషన్ మహదేవ్ జరగడం విశేషం. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్ దాడులు చేసినా, పహల్గాం నరమేధానికి కారణమైన వారిని మట్టుబెట్టినట్టు ఆధారాలు లభ్యం కాలేదు. తాజాగా ఆపరేషన్ మహదేవ్ ద్వారా వారిని భారత సైన్యం హతమార్చింది. ఈ సందర్భంగా భారత సైన్యంతోపాటు, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులకు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.
ఆ ముగ్గురు..
భారత సైన్యం హతమార్చిన ముగ్గురిలో సులేమాన్ ఒకడు. సులేమాన్ అలియాస్ ఫైజల్ అలియాస్ హష్మీ మూసా.. లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎ కేటగిరీ కమాండర్. జిబ్రాన్, అఫ్గాన్ కూడా ఎ కేటగిరీ టెర్రరిస్ట్ లని పేర్కొన్నారు అమిత్ షా. ఈ ముగ్గురు బైసరన్ వ్యాలీలో భారత పౌరుల్ని చంపారు. అప్పట్నుంచి ఈ ముగ్గురు తప్పించుకు తిరుగుతున్నారు. తాజాగా ఈ నీఛుల్ని భారత సైన్యం మట్టుబెట్టింది. ఆ ముగ్గురు దగ్గర లభించిన ఆయుధాలు, పహల్గాం దాడిలో వాడినట్టు పోలీసులు గుర్తించారు.
ఎన్ఐఏ దర్యాప్తు..
మరోవైపు పహల్గాం మారణ హోమంపై ఎన్ ఐఏ దర్యాప్తు చేస్తోందని తెలిపారు హోం మంత్రి అమిత్ షా. పహల్గాంలో జరిగింది అమానుష ఘటన అని ఆయన అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారని, దాడి జరిగిన ప్రాంతానికి తాను వెంటనే వెళ్లానని గుర్తు చేశారు. బాధితులతో స్వయంగా మాట్లాడానన్నారు. ఇక ఆపరేషన్ మహదేవ్ ద్వారా బాధితులకు కాస్తయినా స్వాంతన లభిస్తుందని అన్నారు అమిత్ షా. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవారిని ఎన్‌ఐఏ ఇప్పటికే అదుపులోకి తీసుకుందని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై కూడా అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారా అంటూ కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఆ ముగ్గురు పాకిస్తాన్ నుంచే వచ్చారనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని, పాక్ లో తయారైన పలు డాక్యుమెంట్లు, పాకిస్తాన్ లో తయారైన చాక్లెట్లు వారి దగ్గర లభించినట్టు చెప్పారు అమిత్ షా.