Brahmamokkate Song:వందల ఏళ్ల కిందట మన అన్నమయ్య రాసిన భక్తి కీర్తనకు ఇపుడు ప్రపంచమే నీరాజనాలు పలుకుతుంది. మామూలుగానే అన్నమయ్య పాటలు వినగానే మనకు తెలియకుండానే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది.ముఖ్యంగా తిరుమల కొండపైనో, లేదంటే ఏదైనా సంగీత కచేరీల్లోనో ఈ కీర్తనలు వినిపిస్తుంటే ఎంతో పరవశించిపోతాము .
‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’
అలాంటిది అసలు తెలుగు భాషతోనే పెద్దగా పరిచయం లేని విదేశీ గాయకులు మన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ కీర్తనను తమ గొంతులతో ఇంత బాగా పాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న ‘చాంటిక్లీర్’ అనే సింగర్స్ బృందం ఈ ఏడాది జరిగిన సోల్స్‌బర్గ్ (Solsberg) ఫెస్టివల్ లో ఈ పాటను పాడిన తీరు చూసి సంగీత ప్రియులంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి నెట్టింట్లో ఈ బృందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.పాట విన్న ప్రతి ఒక్కరూ తమ మనసులోని మాటలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు. పాట వింటున్నంత సేపూ ఏదో తెలియని ఎమోషన్ కలిగిందని, కళ్లలో నీళ్లు తిరిగాయని కొందరు ఎమోషనల్ అవుతుంటే, మన తెలుగు పాటను విదేశీయులు ఇంత స్పష్టంగా, ఇంత మధురంగా పాడుతుంటే చాలా గర్వంగా ఉందని మరికొందరు అంటున్నారు.
‘చాంటిక్లీర్’ సింగర్స్ బృందం ఎంతో శ్రద్ధ పెట్టి
ఇంకొందరైతే ఈ పాటను ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదని, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోందని చెప్పడం విశేషం. నిజానికి భాష రానివారికి తెలుగు పదాలు పలకడం అంత ఈజీ కాదని చెప్పాలి .అయినా సరే ఆ ‘చాంటిక్లీర్’ సింగర్స్ బృందం ఎంతో శ్రద్ధ పెట్టి, ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకుని పాడిన తీరుని మెచ్చుకోకుండా ఉండలేము.
ఇక్కడ మనం అన్నమయ్య సాహిత్యం విషయానికి వస్తే పదకవితా పితామహుడిగా పేరు తెచ్చుకున్న తాళ్లపాక అన్నమాచార్యులు వేల కొద్దీ సంకీర్తనలు రాశారు. ఆయన పాటల్లో కేవలం భక్తి మాత్రమే కాదు, మనిషి ఎలా బతకాలి అనే గొప్ప జీవిత సత్యాలు కూడా ఉంటాయి కూడా.
అందులోనూ ఈ ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పాలి. మనుషుల మధ్య కులం, మతం, డబ్బు, అంటూ ఎన్ని తేడాలు ఉన్నా, అందరిలో ఉండే దేవుడు ఒక్కడే అనే గొప్ప మెసేజ్ ని ఈ పాటలో చెప్పుకొచ్చాడు అన్నమయ్య.అందుకే వందల ఏళ్లు గడిచినా ఈ పాట ఇంకా ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.
‘అక్కపెల్లా’ స్టైల్
ఇక ఈ పాట పాడిన చాంటిక్లీర్ బృందం విషయానికి వస్తే వీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన సింగర్స్. వీళ్ల స్పెషాలిటీ ఏంటంటే, వెనుక ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లేకుండా కేవలం తమ గొంతులతోనే అద్భుతమైన మ్యూజిక్ క్రియేట్ చేస్తారు. దీనినే ‘అక్కపెల్లా’ స్టైల్ అంటారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా, కేవలం వాళ్ల గొంతుల ద్వారానే ఆ పాటలోని భక్తిని, ఇంటెన్సిటీని రీక్రియేట్ చేశారు.ఏది ఏమైనా ఒక తెలుగు కీర్తనకు ఇలాంటి ఇంటర్నేషనల్ టీమ్ తమ స్వరాన్ని అందించడం నిజంగా అరుదైన విషయమని చెప్పాలి.
అన్నమయ్య ఎప్పుడో రాసిన ఆ ఆధ్యాత్మిక సందేశం ఈ రోజుకీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నయా జనరేషన్ ని ఆకట్టుకోవడం బట్టి మన తెలుగు సాహిత్యానికి ఉన్న పవర్ ఏంటో అర్థమవుతుంది.
ఏది ఏమైనా . మన సంస్కృతి, మన పాటలు ఇలా ప్రపంచ వేదికలపై వినిపిస్తుంటే ప్రతి తెలుగువాడి గుండె గర్వంతో ఉప్పొంగుతుందనడంలో సందేహం లేదు. దేశాలు వేరైనా, భాషలు వేరైనా సంగీతం, భక్తి అందరినీ ఒక్కటి చేస్తాయని చాంటిక్లీర్ బృందం మరోసారి ప్రూవ్ చేసింది.
అంతర్జాతీయ వేదికపై తెలుగు పాటకు అద్భుత గౌరవం
అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనను శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన చాంటిక్లియర్ బృందం ఎలాంటి వాయిద్యాలు లేకుండా ఆలపించారు. ఈ తెలుగు పాటకు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గౌరవం దక్కించింది.#Annamacharya #Brahmamokkate #Chanticleer… pic.twitter.com/WxLGQquqs4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2026
ALSO READ:ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !